జీవో 317పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కమిటీకి చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖాధిపతుల(HOD)కి పంపించాల్సిందిగా GAD అధికారులను మంత్రులు ఆదేశించారు. స్పౌజ్, మెడికల్, మ్యూచువల్(Mutual)తోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి భార్య/భర్త చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూల నిర్ణయం తీసుకుంది.
పరిశీలనకు…
శాఖాధిపతులకు పంపించిన దరఖాస్తులు మినహా మిగతా అప్లికేషన్లను ఆయా శాఖలకు పంపడమే కాకుండా వాటి పరిశీలన పూర్తయిన తర్వాత తిరిగి కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది. వైద్యారోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన జరిగిన భేటీలో మిగతా సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
సారాంశమిదే…
కొత్త జోన్లు, నూతన జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల(Employees) సర్దుబాటు(Adjustment) కోసం తెచ్చిన జీవో 317. దీనిపై చాలా కాలంగా ఉద్యోగుల్లో ఆందోళన ఉంది. ఈ జీవోను రద్దు చేయాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా.. ప్రధానంగా టీచర్లలో తీవ్ర నిరసన కనిపించింది. కొత్త జిల్లాలు ఏర్పడ్డ వెంటనే ‘వర్క్ టూ ఆర్డర్’ కింద కేటాయింపులు చేశారే గానీ శాశ్వత నియామకాలు చేపట్టలేదు. ఈ సమస్యలు ఒక పట్టాన కొలిక్కి రాకపోవడంతో.. కాంగ్రెస్ సర్కారు దీనిపై కేబినెట్ సబ్ కమిటీ వేసింది.