
Published 07 Dec 2023
ఎన్నికల ప్రచారంలో పరస్పర విమర్శలకు కారణంగా నిలిచిన కరెంటు అంశం.. రేవంత్ తొలి కేబినెట్ లో హాట్ హాట్ గా మారింది. ఇన్నాళ్లూ వెచ్చించిన లెక్కలు తేల్చేదాకా వదిలిపెట్టేది లేదన్న రీతిలో హెచ్చరికలు పంపింది. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం తన తొలి కేబినెట్(First Cabinet Meeting)ను వాడీవేడిగా నిర్వహించింది. ఇన్నాళ్లూ కరెంటు కొనుగోళ్లు, ప్రజలకు అందించిన తీరుపై పూర్తిస్థాయిలో వివరాలు కావాలని కోరింది. రేపటిలోగా సమగ్ర వివరాలతో రావాలని విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులను స్వయంగా ముఖ్యమంత్రే ఆదేశించినట్లు తెలుస్తున్నది. ఈ అంశంపై శుక్రవారం పొద్దున ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్న రేవంత్ రెడ్డి.. ఆ లోపు పూర్తి సమాచారం తన వద్ద ఉండాలని ఆదేశించారు. సీఎండీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా అని ప్రశ్నించిన సీఎం.. రేపటి సమీక్షకు వారిని పిలవాలని స్పష్టం చేశారు.
ఎవ్వర్నీ వదిలిపెట్టొద్దు…
కేబినెట్ భేటీకి హాజరైన విద్యుత్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఇప్పటిదాకా అమలు చేసిన పనుల వివరాల్ని దాచిపెట్టే ప్రయత్నం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని అభిప్రాయపడ్డ CMకు… ఆ శాఖలో ఇప్పటివరకు రూ.85 వేల కోట్ల అప్పులున్నట్లు ఆ విభాగం అధికారులు తెలియజేశారు. దీని అంతు తేల్చేవరకు వదిలిపెట్టబోనంటూ మండిపడ్డ రేవంత్.. క్లారిటీ వచ్చే వరకు ఏ అధికారి రాజీనామాను ఆమోదించేది లేదని కరాఖండీగా చెప్పేశారు. విద్యుత్తు శాఖ హెడ్ గా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన ప్రభాకర్ రావు.. ఇప్పుడు రాజీనామా చేయాలని నిర్ణయించారు. దీన్ని తప్పుబట్టిన ముఖ్యమంత్రి.. లెక్కలు తేలేవరకూ ఎవరి రాజీనామాను అంగీకరించబోమని, పైగా ఆ గణాంకాలతో తన వద్దకు రావాలని ఆదేశించారు.