స్థానిక సంస్థల(Local Bodies)కు ఎన్నికలు నిర్వహించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం(Ready)గా ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఎలక్షన్లు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) రెడీగా ఉన్నందున ప్రభుత్వం కూడా అందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఆదేశించింది. స్థానిక సంస్థల్లో ఏర్పడిన ఖాళీలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 220 సర్పంచులు, 94 MPTCలు, 4 ZPTCలు, 5,324 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎంతోకాలంగా ఖాళీగా ఉన్న స్థానాల్లో వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
మూడు వారాలకు విచారణ వాయిదా
ఈ కేసులో విచారణ కొనసాగించిన న్యాయస్థానం.. రాష్ట్ర ప్రభుత్వానికి విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉన్నందున సర్కారు కూడా అందుకు ప్రిపేర్ కావాలని పేర్కొంది. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకునేందుకు తగిన సమయమివ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది గడువు కోరారు. భారీ వర్షాలు, వరదల వల్ల అతలాకుతలమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాల్సి ఉందని, అందుకు మూడు వారాల గడువు ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్(AG) కోర్టును అభ్యర్థించారు. AG అభ్యర్థనతో విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.