
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ బిజీ బిజీగా మారింది. అటు ROలు, AROలకు ట్రెయినింగ్ క్యాంపెయిన్స్, ఇటు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఓట్ల నమోదు, సవరణల ప్రక్రియకు నాలుగు రోజుల పాటు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం.. ఎలక్షన్లు సజావుగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్.. జిల్లాల ఎస్పీలతో మీటింగ్ నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా చేపట్టబోయే బందోబస్తు, అక్రమ మార్గాలపై పకడ్బందీ చర్యలు ఎలా నిర్వహించాలన్న దానిపై సూచనలు చేశారు. డబ్బు, మద్యం ఏరులై పారే అవకాశం ఉండటంతో సరిహద్దు ఏరియాలతోపాటు అన్ని చోట్లా నిఘా పెట్టాలని CEO స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి DGP అంజినీకుమార్ అటెండ్ అయ్యారు. ఎన్నికల మేనేజ్ మెంట్, పోలింగ్, లా అండ్ ఆర్డర్ పై వికాస్ రాజ్ కీలక సూచనలు చేశారు.
శిక్షణ ఇవ్వనున్న రెండు రాష్ట్రాల CEOలు
రాష్ట్ర అధికారులకు రెండు రాష్ట్రాలకు చెందిన CEOలు ట్రెయినింగ్ ఇస్తున్నారు. పశ్చిమబెంగాల్, తమిళనాడుకు చెందిన ఎన్నికల ప్రధానాధికారులు ఇందులో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ కత్తి మీద సాము లాంటిదని, ఎలాంటి ఘటనలు తలెత్తినా మొదటికే మోసం వస్తుందన్న కోణంలో పూర్తిస్థాయిలో అలర్ట్ గా ఉండాలన్న కోణంలో CEOలు ట్రెయినింగ్ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ డిపార్ట్ మెంట్లలో బదిలీలు పూర్తయ్యాయి. అయితే కొన్ని కమిషనరేట్ల పరిధిలో జరిగిన ట్రాన్స్ ఫర్స్ వివాదాస్పదమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్ మెంట్ తో CEO వికాస్ రాజ్ మీటింగ్ నిర్వహించడంతో ఎలక్షన్లకు సంబంధించి EC విధివిధానాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది.