జమిలి ఎన్నికలంటూ ఊహాగానాలు చెలరేగుతున్న సమయంలో అసలు రాష్ట్రానికి విడిగా ఎన్నికలు ఉంటాయా లేదా అన్న దానిపై అందరిలోనూ అనుమానాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్స్ జరుగుతాయని మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్.. హైదరాబాద్ లోని బూర్గుల రామకృష్ణారావు(BRK) భవన్ లో మీడియా సెంటర్ ను ప్రారంభించారు. ఆ సమయంలో ఎన్నికల నిర్వహణ గురించి మాట్లాడారు.
కేంద్ర ఎన్నికల సంఘం టూర్ తర్వాత
రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు రెండు మూడు నెలల టైమ్ మాత్రమే ఉందని, కేంద్ర ఎన్నికల సంఘం(CEC) డైరెక్షన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని తెలియజేశారు. వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో కేంద్రం ఎన్నికల సంఘం హైదరాబాద్ లో పర్యటన చేపట్టిన తర్వాత.. ఎన్నికల తీరు ఎలా ఉండబోతున్నది స్పష్టంగా వివరిస్తామన్నారు.