Published 01 Dec 2023
ఓటు విషయంలో ఉన్న నిబంధనలు, వెలుసుబాట్ల గురించి కొద్దిమంది తప్ప ఎవరూ పట్టించుకోరు. రాజీ పడి ఓటును వదులుకుంటారే తప్ప తమకున్న హక్కుల గురించి పెద్దగా ఆలోచించరు. కానీ రాష్ట్రంలో ఒకే ఒక్క వ్యక్తి.. తన హక్కు కోసం పోరాటం చేశాడు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం కాగా.. దాన్నెందుకు వదిలిపెట్టాలన్న ఆలోచనతో పోలింగ్ సెంటర్ లోనే పట్టుబట్టి మరీ ఛాలెంజ్ ఓటు వేశాడు. అసలు వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గానికి చెందిన యువకుడు ఛాలెంజ్ ఓటును వినియోగించుకున్నాడు. ఒడ్డుగూడెంలోని 137వ పోలింగ్ బూత్ లో ఓటు వేయాల్సి ఉండగా ఆయన అక్కడకు వెళ్లేసరికే మరొకరు ఓటు వేసి వెళ్లిపోయారు. తాను ఓటే వేయలేదని పోలింగ్ సిబ్బందితో వాదనకు దిగాడు. దీంతో 2 రూపాయలు కట్టించుకుని బ్యాలెట్ పద్ధతిలో ఛాలెంజ్ ఓటు వేయించారు.
ఎలా పరిశీలిస్తారు…
ఛాలెంజ్ ఓటు వేయాలంటే ముందుగా ఓటరును పరిశీలన చేస్తారు. వచ్చిన వ్యక్తి అసలైన ఓటరా, కాదా అన్నది పోలింగ్ ఏజెంట్ల మధ్య అబ్జర్వ్ చేస్తారు. అసలైన ఓటరు అని తెలితేనే రూ.2 తీసుకుని ఛాలెంజ్ ఓటుకు అవకాశం కల్పిస్తారు. వచ్చిన వ్యక్తి నిజమైన ఓటరు కాదని భావిస్తే ఆ రెండు రూపాయల్ని ఏజెంట్ కు అందజేసి అతణ్ని అనర్హుడిగా ప్రకటించి బయటకు పంపిస్తారు.
ఇద్దరికి సమానంగా వచ్చినపుడే
ఈ ఛాలెంజ్ ఓటును రెగ్యులర్ ఓటర్ల మాదిరిగా లెక్కల్లోకి తీసుకునే వీలుండదు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చినపుడు మాత్రమే ఈ ఛాలెంజ్ ఓటును పరిగణలోకి తీసుకుంటారు. ఇలా ఎన్నికల సంఘం కల్పించిన హక్కుని రాష్ట్రంలో ఆ యువకుడు మాత్రమే ఉపయోగించుకోవడం ఆశ్చర్యకరంగా మారింది.