రాష్ట్రంలోని 11 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు(heavy rains) పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇందులో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలుంటాయి. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఒడిశా-గంగా, పశ్చిమబెంగాల్(west bengal) తీరాలలో తుపాను ప్రభావానికి తోడు ఉత్తర ఒడిశా దానికి ఆనుకుని ఉన్న పశ్చిమబెంగాల్, జార్ఖండ్ పై ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్షాలు ఉంటాయని తెలిపింది. మంగళవారం(జులై 18) నాటికి వాయువ్య బంగాళాఖాతంలో తుపాను సర్క్యులేషన్ ఏర్పడే అవకాశం ఉంది.
నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నందున ‘ఎల్లో అలర్ట్’ కొనసాగుతుందని వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 20 వరకు రోజుకు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నందున ‘ఎల్లో అలర్ట్’ అప్పటివరకు కంటిన్యూ అవుతుందని స్పష్టం చేసింది.