
జగాలను ఏలే మాత.. ముగురమ్మల మూలపుటమ్మ.. మహాకాళి, మహాలక్ష్మీ, సరస్వతీదేవి అంశ అయిన జగజ్జనని.. శక్తి స్వరూపిణి. సకల జగత్తుపై కరుణాకటాక్షాలు కురిపించాలన్న సత్సంకల్పంతో జగిత్యాల జిల్లా కేంద్రంలో శత చండీయాగం ప్రారంభిస్తున్నారు. అత్యంత నియమ, నిష్ఠలతో సాగే ఈ క్రతువు ఈనెల 4 నుంచి 9వ తేదీ వరకు ఆరు రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగనుంది. పెద్దసంఖ్యలో వేద పండితులు, వేలాది మంది భక్తజనుల సాక్షిగా నిర్వహించే ఈ యాగ వేడుక.. పద్మనాయక కళ్యాణ మండపంలో జరగనుంది. 4నాడు ఉదయం వేద మంత్రోచ్ఛరణలు, మహిళల కోలాటల నడుమ భక్త మార్కండేయ స్వామి ఆలయం నుంచి జగన్మాత విగ్రహ శోభాయాత్రతో శత చండీయాగం మొదలవుతుందని నిర్వాహకులైన ప్రముఖ వేద, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ తిగుళ్ల విశ్వనాథం శర్మ(విశ్శు) తెలిపారు.
నిత్యం వివిధ పూజలు, అర్చనలు
గణపతిపూజ, పుణ్యాహవచనం, దీక్షా స్వీకారం, యాగశాల ప్రవేశంతోపాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈనెల 5 నుంచి 8 వరకు శత చండీ పారాయణం, హోమ క్రియలు, మహాగణపతికి లక్ష దుర్వార్చన, లయకారుడైన మహదేవుడి కృప కోసం బిల్వార్చన, దేవదేవికి నిత్యం కుంకుమార్చన, నవగ్రహ, నక్షత్ర హోమాలతోపాటు పుష్పార్చనలు చేపడతారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి జగన్మాత సేవలో తరించాలని విశ్వనాథం శర్మ కోరుతున్నారు.