Published 07 Jan 2024
ఆదివారం వచ్చిందంటే చాలు.. ముక్క ముట్టందే ముద్ద దిగదు. అందుకే వార వారం నాన్ వెజ్(Non Veg) కు విపరీతమైన గిరాకీ ఉంటుంది. మటన్(Mutton), చికెన్(Chicken), చేపల(Fish) కోసం పొద్దున్నుంచే దుకాణాలు, రైతు బజార్లు, రోడ్లపై బారులు తీరుతుంటారు. రేట్లు ఎంత పెరిగినా ఆదివారం నాడు ఉండే గిరాకీ గురించి చెప్పాల్సిన పని లేదు. అయితే దుకాణాల్లో పెద్దయెత్తున మోసాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్క రోజే చేసిన దాడుల్లో పెద్దసంఖ్యలో కేసులు ఫైల్ చేశారు. మటన్ క్వాలిటీదా కాదా అన్నది కూడా చూడకుండా ఎడాపెడా కొంటున్నా… దుకాణదారులు మాత్రం మోసాలు ఆపడం లేదు.
రూ.800కు పైగా అమ్ముతున్నా…
పట్టణాలు, నగరాల్లో కిలో మటన్ ప్రస్తుతం రూ.800 నుంచి కొన్నిచోట్ల రూ.900 దాకా అమ్ముతున్నారు. ఇక చిన్న పట్టణాలు, పల్లెటూళ్లలో రూ.700 వరకు కొంటున్నారు. సాధారణ రోజుల్లో ఎక్కువగా చికెన్ తినే ప్రజలు ఆదివారం నాడు మాత్రం మటన్ కొంటుంటారు. కానీ నాన్ వెజ్ కొనేటప్పుడు దుకాణాల్ని పరిశీలించాలని అధికారులు చెబుతున్నారు. కాంటా కొడుతుండటంతో కిలోకు బదులు 800 గ్రాములు మాత్రమే వస్తున్నట్లు గుర్తించి చాలా చోట్ల కేసులు ఫైల్ చేశారు. కాంటా కొడుతున్నదాన్ని లెక్కేసుకుంటే కిలో మటన్ ధర రూ.1,000 దాటుతున్నట్లు స్పష్టమవుతున్నది. రాష్ట్రస్థాయి అధికారి అయిన అసిస్టెంట్ కంట్రోలర్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మూకుమ్మడిగా దాడుల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయి.
హైదరాబాద్ సహా చాలా చోట్ల…
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తే.. ఆయా ప్రాంతాల్లో భారీస్థాయిలో మోసాలు బయటపడ్డాయి. ఎలక్ట్రానిక్ కాంటాల్లో మటన్, చికెన్ లెక్క చూసి ఇస్తున్నా వాటిలో ముందుగానే సెట్టింగ్స్ ను మార్చడంతో జనాలు గుర్తు పట్టడం లేదు. ఉప్పల్, కొత్తపేట, కుషాయిగూడ వంటి పెద్ద మార్కెట్లతోపాటు వికారాబాద్ జిల్లాలో పెద్దయెత్తున తనిఖీలు నిర్వహించారు. మొత్తంగా ఇప్పటివరకు 54 కేసులు నమోదు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో తెలుసుకోవచ్చు. కొత్తపేట రైతు బజార్ తోపాటు దాని సమీప ప్రాంతాల్లోనే 19 కేసులు నమోదయ్యాయి. ఇక వికారాబాద్ లో 29 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.