అసలే తక్కువ పోస్టులు. ఒక్కో ఉద్యోగానికి వేలల్లో కాంపిటీషన్. ఈ పోస్టులకు తమతోపాటు బీఈడీ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించడం డీఎడ్ క్యాండిడేట్స్ ను తీవ్ర నిరాశను గురిచేస్తున్నది. ఇలా SGT పోస్టుల అర్హతపై పెద్ద సందిగ్ధత ఏర్పడిన తరుణంలో దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు విద్యాశాఖ రెడీ అవుతున్నట్లు తెలుస్తున్నది. బీఈడీ చేసినవారు కాకుండా డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే SGT పోస్టులకు అర్హులంటూ(Eligible) సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలోనూ అమలు చేయబోతున్నారు. SGT ఉద్యోగాలకు డీఎడ్ చదివినవారే ఎలిజిబుల్ అని రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవలే సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. నిజానికి ఈ పోస్టులకు బీఈడీ చదివినవారు కూడా అర్హులేనని NCTE 2018లో ఉత్తర్వులివ్వగా.. ఇప్పుడు సుప్రీం తీర్పుతోనే ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి.
NCTE ఉత్తర్వులతోనే 1.86 లక్షల మంది బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్-1కు అప్లయ్ చేయగా.. ఇప్పుడీ తాజా నిర్ణయంతో వారు ఆ అవకాశాన్ని కోల్పోనున్నారు. ఏ పోస్టుకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలన్న సందిగ్ధత(Confusion)ను తొలగించేందుకు విద్యాశాఖ త్వరలోనే జీవో జారీచేయనున్నట్లు తెలుస్తున్నది.