MP కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి తనపై జరిగినట్లుగానే భావిస్తున్నానని ముఖ్యమంత్రి KCR అన్నారు. ‘కత్తులు పట్టుకుని మా పార్టీ అభ్యర్థులపైకి వస్తున్నారు.. మాకు తిక్కరేగితే రాష్ట్రంలో దుమ్మురేగుతుంది.. మా సహనాన్ని పరీక్షించవద్దు’ అని బాన్సువాడలో నిర్వహించిన సభలో వార్నింగ్ ఇచ్చారు. అటు కత్తితో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హెల్త్ బులెటిన్ విడుదల
అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం నిర్వహిస్తున్న BRS పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరగ్గా.. గాయాలపాలైన ఆయనకు చికిత్స నిర్వహించారు. మెదక్ MP ప్రభాకర్ రెడ్డికి ఈ ఎన్నికల్లో దుబ్బాక సీటు కేటాయించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ప్రచారం చేస్తున్న సమయంలో రాజు అనే వ్యక్తి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లుగా నటించి కడుపులో కత్తితో పొడిచాడు. దీంతో ఆయన్ను తొలుత గజ్వేల్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. అక్కణ్నుంచి ఆయన్ను సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు హెల్త్ బులెటిన్ లో తెలిపారు. MP ఆరోగ్య పరిస్థితి గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పడు మంత్రి హరీశ్ రావు ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. ఎంపీపై దాడి గురించి తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు హాస్పిటల్ కు చేరుకోవడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.