Published 11 Dec 2023
అధికారంలోకి రావడానికి గల కారణమైన హామీలపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ సర్కారు ఒక్కొక్క పథకాన్ని అమలు చేసే పనిలో పడింది. తాము పగ్గాలు చేపడితే రైతు భరోసాను అందిస్తామని హామీ ఇవ్వగా.. ఇప్పుడా మాటను నిలబెట్టుకుంది. రైతు భరోసా స్కీమ్ కు సంబంధించి విధివిధానాలు(Guidelines) ఇంకా ఖరారు కాకపోయినా, రైతులు ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో ఎలాగైనా నిధులు చెల్లించాలన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో పంట పెట్టుబడి చెల్లింపులకు రేవంత్ రెడ్డి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, ట్రెజరీల్లో ఉన్న నిధులను విడుదల చేసి చెల్లింపులు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు త్వరలోనే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం పడనున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతున్నది.
ఇప్పుడు విడుదల చేసే నిధులను గతంలో మాదిరిగానే రైతుల ఖాతాల్లో వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు రైతు భరోసా పథకం గైడ్ లైన్స్ నిర్ణయించాల్సి ఉంది. ఇప్పటికైతే చెల్లింపులు చేసి కొత్త పథకానికి సంబంధించిన విధానాలపై వెంటనే దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు.