వీధి వ్యాపారం(Street Food)తో సంచలనంగా మారిన కుమారి ఆంటీ హోటల్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా(Social Media) ద్వారా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారికి ఆయన అండగా నిలిచారు. సోషల్ మీడియా పుణ్యమాని ఈమె ఫుడ్ ఫేమస్ కావడంతో జనం కిక్కిరిసిపోయారు. రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి వద్ద భోజన స్టాల్ ను నడిపిస్తుండగా… యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ విపరీతంగా పెరిగింది. దీంతో జనాలు పెద్దయెత్తున రావడం.. ఆ ఫుడ్ ను టేస్ట్ చేసేందుకు సామాన్యుల నుంచి సెలెబ్రిటీల దాకా వస్తుండటంతో కేబుల్ బ్రిడ్జ్(Cable Bridge) వద్ద రద్దీ మొదలై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
కేసు ఫైల్…
ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అంటూ కుమారి ఆంటీ హోటల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అక్కణ్నుంచి ఫుడ్ సెంటర్ ను తీసేయాలని వార్నింగ్ ఇచ్చారు. రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదంటూ ఆ దుకాణాన్ని వేరే చోటుకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ విషయం CM రేవంత్ దృష్టికి వెళ్లడంతో ఆయన వేగంగా స్పందించారు. సామాన్యులు వ్యాపారం చేసుకుంటే నష్టమేంటంటూ వెంటనే DGPకి ఆదేశాలు జారీ చేశారు. కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ను పాత ప్లేస్ లోనే కంటిన్యూ చేయాలంటూ DGPకి CM ఆదేశాలిచ్చారు. ప్రజాపాలనలో చిరు వ్యాపారులకు ఎప్పుడూ స్థానం ఉంటుందని రేవంత్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి త్వరలోనే కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ కు వెళ్లి భోజనం టేస్ట్ చేస్తారనే మాటలు వినపడుతున్నాయి.
ఏపీలో గరం గరం…
అయితే ఈ హోటల్ విషయం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రంగు పులుముకొంది. తనకు ఉన్న ఏకైక ఆస్తి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు అంటూ ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దీన్ని YCP శ్రేణులు వైరల్ చేయడంతో అక్కడి ప్రతిపక్ష పార్టీలు గుర్రుగా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. కావాలనే ఆమె స్టాల్ ను మూయించేందుకు తమ ప్రతిపక్ష పార్టీలు కుట్రలు పన్నాయంటూ YCP నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేసుకున్నారు. ఇలా సోషల్ మీడియాతో పాపులర్ కావడమే కాదు.. వీధి వ్యాపారం కాస్తా రెండు రాష్ట్రాల రాజకీయాల్ని ప్రభావితం చేసేలా తయారైంది.
ఆమె నేపథ్యమిది…
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన సాయి కుమారి.. భర్తతో కలిసి ఫుడ్ స్టాల్ ఓపెన్ చేశారు. రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి వద్ద గల TSIIC స్థలంలో ఫుట్ పాత్ పై అందరిలాగే తానూ ఫుడ్ స్టాల్ ను నడుపుతున్నారు. తక్కువ ధరకే మాంసాహారం(Non-Veg) దొరకడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఇతర టూరిస్టులతో ఆ స్టాల్స్ బాగా రన్ అవుతున్నాయి. తక్కువ ధరకే భోజనం రావడం, ఎక్కువ రకాల్ని కొద్దికొద్దిగా రుచి చూపిస్తూ ఇంటి మనిషిలా పలకరించడంతోపాటు స్టాల్ కు గిరాకీ పెరగడంతో సాయి కుమారి కాస్తా కుమారి ఆంటీగా మారిపోయారు. ఈ మధ్య యూట్యూబ్ లో ఆమె స్టాల్ గురించి ప్రచారం జరగడంతో జనాల సంఖ్య క్రమంగా పెరిగి రద్దీ ఏర్పడటంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.
Published 31 Jan 2024