కొత్త రేషన్ కార్డుల(New Ration Cards)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా అమలవుతాయని ప్రకటించారు. వ్యవసాయ యోగ్య భూములకు కచ్చితంగా రైతు భరోసా నిధులు అందుతాయని, సాగులో లేని వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పథకం వర్తించదంటూ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఈ స్కీమ్ ను ఇక నుంచి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’గా పిలవాలంటూ ప్రతి ఎకరానికి రూ.12,000 చొప్పున అందజేస్తామన్నారు. 2025 జనవరి 26 నుంచి ఈ పథకాలు(Scheme) అమలు చేయడానికి ప్రధాన కారణం… రాజ్యాంగం అమలై 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకోవడమేనని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రైతుబంధు కింద రూ.10 వేలు ఇస్తే తాము దాన్ని రూ.12 వేలకు పెంచుతున్నామని, ఇక భూమిలేని నిరుపేద కుటుంబాలకు సైతం ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.