ఈ రోజుల్లో లక్ష రూపాయలు సంపాదించడం సాధారణం(Common) అయిందని, అందుకే ఇక కోటీశ్వరుల్ని చేయడమే తమ లక్ష్యమంటూ మహిళా సంఘాల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలపైనే ఆర్థిక భరోసా ఉంటుందని, పురుషుల కన్నా వారి వద్దే డబ్బు నిలుస్తుందన్నారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించిన CM.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి సహా అధికారగణంతో కోస్గిలో మహిళలతో సమావేశమయ్యారు. అంతకుముందు రూ.4,369 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేసిన ఆయన.. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనులకు శ్రీకారం చుట్టారు.
పంటల కొనుగోళ్లు సైతం..
రాష్ట్రంలో పంటల కొనుగోళ్లను IKP, మహిళా సంఘాల ద్వారానే జరిపిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మెడికల్, నర్సింగ్, డిగ్రీ, ఇంటర్ కాలేజీలకు శంకుస్థాపనలు చేశారు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలియజేశారు.