Published 07 Jan 2024
కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి నెల రోజులు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సేవకులే తప్ప పాలకులం కాదంటూ ట్వీట్ సాగింది. గత డిసెంబరు 7న బాధ్యతలు చేపట్టి నెల రోజులు పూర్తయిన వేళ తన అనుభవాల్ని ‘X’ వేదికగా పంచుకున్నారు. ఆయన మాటల్లోనే చూస్తే.. ‘సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది… సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ, పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది… పేదల గొంతుక వింటూ, యువత భవితకు దారులు వేస్తూ.. అన్ని వర్గాలకు భరోసానిస్తూ’ అంటూ ఆయన సందేశం సాగింది.
‘గుండెల్లో తనను పెట్టుకున్న తెలంగాణను శాశ్వతంగా గుండెల్లో నిలిచిపోయేలా ఇక ముందు కూడా బాధ్యత నిర్వర్తిస్తా’నంటూ ఆయన ట్వీట్ ను ముగించారు.