Published 22 Nov 2023
కులాలను ఎంతలా వాడుకుని పార్టీలు రాజకీయం చేశాయో ఇప్పుడవే కులాలు ఈ ఎన్నికల్లో ప్రతాపం చూపించబోతున్నాయి. ఏ పార్టీకి ఓటు వేయాలన్న విషయంలో కొన్ని కులాలు ఇప్పటికే డిసిషన్ కు వచ్చాయి. నిజానికి తెలంగాణలో కుల రాజకీయాలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తే కమ్యూనిటీ పాలిటిక్సే కీలకం కాబోతున్నాయి. సోషల్ మీడియా పుణ్యమాని కనిపిస్తున్న చైతన్యం ఈ ఎన్నికలనూ తాకింది. ఈ చైతన్యమే ఇప్పుడు కొన్ని పార్టీల కొంప ముంచే స్థాయికి చేరింది. ముఖ్యంగా యువత ఇప్పుడు ఒక ప్రముఖ పార్టీపైనే దృష్టిపెడితే.. మరికొన్ని కులాలు మాత్రం రెండు పార్టీలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు ఆయా వర్గాల వారి మాటల్ని చూస్తే అర్థమవుతుంది.
‘పెద్ద కులానిదే ఆ పార్టీ’.. అన్న భావన
ఈ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇవ్వబోతున్న ఒక ప్రధాన పార్టీ.. ఉన్నత కులానికి చెందిందన్న ఫీలింగ్ అందరిలోనూ ఏర్పడింది. ఆ పార్టీని గెలిపిస్తే అధికారమంతా ఇక వాళ్ల చేతుల్లోకే వెళ్లిపోతుందన్న మాటలు బలంగా ఉన్నాయి. అందులో ముఖ్యమైన లీడర్లంతా అచ్చంగా అదే కమ్యూనిటీకి చెందినవాళ్లే. ఈ ఎలక్షన్లలో ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ పార్టీకి చెందిన లోకల్ లీడర్ల ఓవర్ యాక్షనే కొంప ముంచబోతున్నది. సదరు వర్గానికి చెందిన ఆ లీడర్లు అధికారం తమదే అన్న రీతిలో ఊళ్లల్లో డామినేషన్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే గెలిచాక ఎలా ఉంటుందన్న అనుమానాలు పల్లెల్లో కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం ఆ పార్టీ ఓట్లను ఉల్టాపల్టా చేసే ప్రమాదం పొంచి ఉంది.
అధికారం కష్టమే.. ఓట్లకు ఢోకాలేదు
ఇక మరో పార్టీని పరిశీలిస్తే… అధికారం చేపడతామన్న ఆశ బయటవాళ్లలో కాదు ఆ పార్టీలోనే కనిపించడం లేదు. అలాంటి పార్టీ మాత్రం ఈసారి పెద్దయెత్తున ఓట్లను కొల్లగొట్టబోతున్నట్లు సంకేతాలున్నాయి. వెనుకబడ్డ, అణగారిన వర్గాల్లోని కులాల ఓట్లు గంపగుత్తగా పడబోతున్నాయి. యూత్ కు తోడు ఫ్యామిలీల్లోనూ చైతన్యం పెరగడంతో ఊహించని రీతిలో ఆ పెద్ద పార్టీకి ఓటింగ్ శాతం రానున్నట్లు తెలుస్తున్నది. గెలిచే సీట్లు ఎన్నుంటాయో కానీ.. ఈ ఓటింగ్ వల్ల ఈసారి మిగతా రెండు పార్టీలకు దెబ్బ పడటం ఖాయమన్న మాటలున్నాయి.
గొప్పలకు పోతున్నా.. కష్టకాలమే
అధికారం తమదేనని గొప్పలకు పోతున్న ఈ మూడో ప్రధాన పార్టీకి సైతం ఈసారి కుల ఓట్లతో దెబ్బ పడనుంది. బడుగు, బలహీనవర్గాలకు తగిన రీతిలో సీట్లు కేటాయించలేదన్న కోపం… కేవలం కొన్ని వర్గాలకు లక్ష్యంగా చేసుకుని లబ్ధి కలిగించేలా వ్యవహరించడం ప్రతికూలతను తెస్తున్నది. రెండు ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉండటంతో ఓటును ఈసారి అటువైపు వేయాలన్న నిర్ణయానికి ఆయా కులాల ఓటర్లు వచ్చారు. ఇలా 3 పార్టీలు గొప్పలకు పోతున్నా.. ఈసారి కుల రాజకీయాలే కీలకం కాబోతున్నాయి.