గురుకుల టీచర్ రిక్రూట్ మెంట్ ఎగ్జామ్స్ సెంటర్లు అభ్యర్థుల(Candidates)ను గందరగోళానికి గురిచేస్తున్నాయి. రోజువారీ పేపర్లను వేర్వేరు జిల్లాల్లో కేటాయించడంతో పరీక్ష ఎలా రాసేదంటూ ఆవేదన చెందుతున్నారు. సాయంత్రం ఒక జిల్లాలో తెల్లారి మరో జిల్లాలో ఎగ్జామ్ ఉండటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అసలే వర్షాలు, రోడ్లు ఎక్కడికక్కడ తెగిపోయాయి.. రవాణా లేక అన్ని చోట్లా ఇబ్బందులే.. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వంద కిలోమీటర్లకు పైగా జర్నీ చేయడం సాధ్యమా అని ప్రశ్నిస్తున్నారు. రిక్రూట్ మెంట్ బోర్డు తీరుతో అభ్యర్థుల్లో ఆవేదన కనిపిస్తోంది. SC, ST, BC, మైనార్టీ గురుకుల సొసైటీల్లో TGT, PGT, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, JL, DL విభాగాలకు ఆగస్టు 1 నుంచి 23 వరకు ఆన్ లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. 9,210 జాబ్స్ కోసం 2,66,000 అప్లికేషన్లు వచ్చాయి.
TGTకి లక్ష మంది అప్లై చేసుకోగా మూడు పేపర్లను మూడు సార్లు రాయాల్సి ఉంటుంది. వేర్వేరు రోజుల్లో ఎగ్జామ్స్ జరిగేలా బోర్డు ఏర్పాట్లు చేసింది. జనరల్ గా ఒకటికి మించి ఎగ్జామ్స్ ఉంటే ఒకే సెంటర్లో అన్నీ రాసేలా ఏర్పాట్లు ఉంటాయి. కానీ గురుకుల బోర్డు మాత్రం పలువురు అభ్యర్థులకు మూడు పేపర్లకు డిఫరెంట్ సెంటర్స్ ను కేటాయించింది. కొందరికీ ఒకే టౌన్ లో ఇవ్వగా.. మరికొందరికి వేరే జిల్లాల్లో సెంటర్ వేశారు. ఒక అభ్యర్థికి సాయంత్రం వరంగల్ లో ఎగ్జామ్ ఉండగా తెల్లారి మార్నింగ్ షిఫ్ట్ లో ఆదిలాబాద్ లో సెంటర్ పడింది. వరంగల్ నుంచి ఆదిలాబాద్ కు అంత తక్కువ టైమ్ లో వెళ్లడం సాధ్యమా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ మూడు పేపర్లను కొందరికి మూడు జిల్లాల్లో కేటాయిస్తుండటంపై స్టూడెంట్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇన్నేళ్లకు నిర్వహిస్తున్న ఎగ్జామ్ ను ఇంత గందరగోళంగా తయారుచేశారంటూ అభ్యర్థులు మండిపడుతున్నారు. అందుబాటులో స్లాట్ లకు అనుగుణంగా సెంటర్లు వేశామని.. అభ్యర్థులు ఎక్కువగా, స్లాట్ లు తక్కవగా ఉండటం వల్ల ఇలా వేయాల్సి వచ్చిందని గురుకుల బోర్డు అధికారులు అంటున్నారు.