Published 25 Nov 2023
అందరిచేతా ఓటు వేయించేలా ఎన్నికల బాధ్యతలు చూసే సిబ్బంది.. తాము వేసే ఓటు విషయంలో మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అనుకున్న రీతిలో పోస్టల్ బ్యాలెట్లు అందక ఓటు వేస్తామా లేదా అన్న అయోమయంలో పడిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో(Election Duties) పాల్గొనే ఉద్యోగులు 3 లక్షల మంది దాకా ఉన్నారు. అయితే ఇప్పటివరకు 1.60 లక్షల పోస్టల్ బ్యాలెట్లకు మాత్రమే ఆమోదం లభించింది. దీంతో మిగతా 1.40 లక్షల మంది ఉద్యోగుల పరిస్థితి ఏంటన్నది అర్థం కాని విధంగా తయారైంది. ఇలాంటి వాతావరణం ఒకవైపు ఉండగా.. మరోవైపు తమకు పోస్టల్ బ్యాలెట్ అందలేదంటూ పెద్దయెత్తున కంప్లయింట్లు రావడంతో జిల్లాల ఉన్నతాధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇప్పటికిప్పుడు ఇంతమందికి పోస్టల్ బ్యాలెట్లు ఎలా అందుబాటులో ఉంచాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.
కలెక్టర్లతో ఈసీ అధికారుల టెలికాన్ఫరెన్స్
పోస్టల్ బ్యాలెట్ల అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద్యోగుల ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకున్న ఎలక్షన్ కమిషన్.. రేపటిలోగా మొత్తం ప్రక్రియనంతా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(CEO) వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే రెండు విడతల్లో శిక్షణ పూర్తి చేశారు. పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో ఇలా పోస్టల్ బ్యాలెట్ ల విషయంలో గందరగోళం ఏర్పడటం అయోమయానికి దారితీసింది. గతంలో జరిగిన ఎన్నికలల్లో ఇంటిమేషన్ ఆర్డర్ కాపీ చూపించగానే రిసెప్షన్ కౌంటర్ లో పోస్టల్ బ్యాలెట్ అందించేవారు. కానీ ఈసారి అలా కాకుండా.. అక్కడంటే ఇక్కడ, ఇక్కడంటే అక్కడ అన్న తీరుగా సిబ్బందిని తిప్పించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.