లేక లేక వచ్చిన అవకాశం.. కొత్త ప్రభు త్వం ఏర్పడ్డాక సర్కారీ స్కీమ్ ల కోసం పెట్టుకున్న దరఖాస్తు(Applications)ల్లో తప్పులుంటే ఎలా… మరి ఆరు గ్యారంటీల్లో గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు వస్తుందా… అన్న అనుమానాలతో ఉన్న ప్రజలకు ప్రభుత్వం స్పష్టత(Clarity)నిచ్చింది. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ మేలు జరిగేలా చూడాలని CM అన్నారు. డిప్యుటీ సీఎంతో కలిసి కేబినెట్ సబ్ కమిటీతో సచివాలయంలో రివ్యూ నిర్వహించిన రేవంత్… ఈనెల 27 లేదా 29న రెండు పథకాల్ని ప్రారంభించే ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
దరఖాస్తుల్లో సవరణలకు…
ప్రజాపాలన(Prajapaalana) దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరిచేసుకునే(Correction) అవకాశమివ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అప్లికేషన్లలో కార్డు నెంబర్లు, కనెక్షన్ నంబర్లలో తప్పుల వల్ల జీరో బిల్లుకు అర్హత కోల్పోయే వారెవరైనా ఉంటే… అలాంటి వారికి సరిచేసుకునే ఛాన్స్ ఇవ్వాలన్నారు. కరెంటు బిల్ కలెక్షన్ సెంటర్లు, సర్వీసు సెంటర్ల వద్ద ఈ సవరణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలోనూ అందరికీ తెలిసేలా విద్యుత్తు శాఖ సైతం తగినంత ప్రచారం నిర్వహించాలని, తప్పులు సవరించుకున్న తర్వాత అర్హులందరికీ ఉచిత కరెంటు, రూ.500 గ్యాస్ సిలిండర్ ఇవ్వాలన్నారు.
సబ్సిడీ ఎలా ఇస్తారంటే…
గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ స్కీమ్ లను అమలు చేయడానికి గల విధివిధానాల(Guidelines)పై దృష్టిపెట్టాలని ఉన్నతాధికారుల్ని సీఎం, డిప్యుటీ CM ఆదేశించారు. ప్రజాపాలన కింద వచ్చిన అర్హులైన దరఖాస్తుదారులకు కచ్చితంగా రూ.500 సిలిండర్ అందించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా బదిలీ చేయాలా లేక ఏజెన్సీలకు చెల్లించాలా అన్న దానిపై పరిశీలన చేపట్టాలన్నారు. ఒకవేళ అలా చేస్తే వచ్చే అడ్డంకులు, ఇబ్బందులు, అమలు సాధ్యాసాధ్యాలపై పౌరసరఫరాలు, ఆర్థిక శాఖల అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు(Beneficiaries) రూ.500 కడితే చాలు.. సిలిండర్ ఇవ్వాల్సిందేనన్నారు.
ఫ్రీ కరెంటు ఇచ్చే ముందు…
తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంటును పారదర్శకంగా అందివ్వాలని విద్యుత్తు శాఖ అధికారులను CM ఆదేశించారు. మార్చి తొలి వారం నుంచి కరెంటు బిల్లులు ఇచ్చేటప్పుడు.. లబ్ధిదారులకు గృహజ్యోతి స్కీమ్ కింద జీరో(Zero) బిల్లులు ఇవ్వాలన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోనివారు ఇకనైనా MPDO, తహసీల్దార్ ఆఫీసుల్లో అప్లై చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉండాలని CS శాంతికుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ CS రామకృష్ణారావు, సివిల్ సప్లయిస్ కమిషనర్ డి.ఎస్.చౌహాన్, ట్రాన్స్ కో-జెన్ కో CMD రిజ్వీ తదితరులకు ఆదేశాలు జారీ చేశారు.