కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు IASలకు హైకోర్టు జరిమానా విధించింది. సీనియర్ IASలు నవీన్ మిట్టల్, వాకాటి కరుణతోపాటు కళాశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ G.యాదగిరి, కల్వకుర్తి ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ R.స్వర్ణలతకు శిక్ష పడింది. ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున ఫైన్ కట్టాలని, నాలుగు వారాల్లో ఫైన్ కట్టకుంటే నెల రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మోడల్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న K.శ్రీనివాసరావును 2022 ఆగస్టు 5 నుంచి తొలగిస్తూ ఇచ్చిన ఆర్డర్స్ ను క్యాన్సిల్ చేసింది. ఆ ఉద్యోగిని రీమూవ్ చేసే అధికారం కమిషనర్ కు లేదని హైకోర్టు పేర్కొంది.
తనను ఉద్యోగం నుంచి రీమూవ్ చేస్తూ ఇచ్చిన ఆర్డర్స్ ని సవాల్ చేస్తూ శ్రీనివాసరావు.. కోర్టును ఆశ్రయించారు. ఆయన్ను 2022 ఆగస్టు 5 నుంచి అక్టోబరు 26 వరకు డ్యూటీలోకి తీసుకుంటున్నట్లు ఆర్డర్స్ ఇచ్చినా అది అమలు చేయలేదు. 2022 అక్టోబరు 26న సదరు ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు మరోసారి ఆర్డర్స్ ఇచ్చారు. దీంతో బాధితుడు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. వాదనలు విన్న జస్టిస్ పి.మాధవీదేవి.. నలుగురు అధికారులకు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.