టీచర్ల ప్రమోషన్లకు సంబంధించిన రంగారెడ్డి జిల్లా సీనియారిటీ లిస్టుపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగింది. ప్రమోషన్లపై ఇచ్చిన ‘స్టే’ను అక్టోబరు 10 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. స్కూల్ అసిస్టెంట్లు, SGTల ప్రమోషన్లపై ఇంతకుముందు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సీనియారిటీ లిస్టుపై SGTలు, స్కూల్ అసిస్టెంట్లు వేసిన పిటిషన్లపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 317 ద్వారా ఇతర జిల్లాల టీచర్లను రంగారెడ్డి జిల్లాకు కేటాయించారంటూ పలువురు ఉద్యోగులు పిటిషన్లు దాఖలు చేశారు. జిల్లా క్యాడర్ కన్నా ఎక్కువగా టీచర్లను కేటాయించారంటూ పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్ డి.బాలకిషన్ రావు వాదనలు వినిపించారు. ప్రాథమిక సీనియారిటీ లిస్టుపై అభ్యంతరాలకు తగిన సమయం ఇవ్వలేదని, టైమ్ ఇవ్వకుండానే ప్రమోషన్లకు సిద్ధమయ్యారంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. అయితే పూర్తిస్థాయిలో అభ్యంతరాలు పరిశీలించాకే తుది సీనియారిటీ జాబితా రూపొందిస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. సీనియారిటీ లిస్టు ఇవ్వకుండా ప్రమోషన్లు ఇచ్చేది లేదని నాలుగు రోజుల క్రితమే ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై మరోసారి విచారణ జరిపిన హైకోర్టు.. స్టే ఉత్తర్వుల్ని పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.