
తెలంగాణ ఉద్యోగ నియామకాల బోర్డు TSPSCపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టు సింగిల్ బెంచ్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ద్విసభ్య బెంచ్ ను TSPSC ఆశ్రయించడంతో… ఈ కేసుపై విచారణ ఇవాళ జరిగింది. కమిషన్ తీరుపై అసహనం, ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు… ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియదా అని ప్రశ్నించింది. మరోవైపు ఈ కేసు విచారణను బుధవారాని(రేపటి)కి వాయిదా వేసింది. వాయిదా వేసింది. సెప్టెంబరు 25న(నిన్న) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ నెల 26(ఇవాళ) విచారణ చేస్తామని కోర్టు తెలిపింది. సోమవారమే విచారణ జరపాలని TSPSC లాయర్ కోరగా అందుకు ధర్మాసనం నిరాకరించింది. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిలతో కూడిన బెంచ్ ఎదుట గ్రూప్-1 పరీక్ష రద్దుపై వాదనలు కొనసాగాయి.
ఒకసారి రద్దయినా తీరు మారదా…
నోటిఫికేషన్ లో తెలిపినట్లు బయోమెట్రిక్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన కోర్టు… దాని వల్ల ఇబ్బందులేంటో చెప్పాలని స్పష్టం చేసింది. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ నే అమలు చేయలేకపోతే ఇక ఎందుకు అని నిలదీసింది. ఒకసారి ఎగ్జామ్ రద్దయ్యాక అయినా జాగ్రత్తగా ఉండాలి కదా.. నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత TSPSCకు ఉంది అంటూ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.