తెలంగాణ విద్యా వ్యవస్థపై సంచలన రీతిలో మాట్లాడిన బొత్స సత్యనారాయణ తీరుపై మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. ‘పబ్లిక్ సర్వీస్ కమిషన్ దొంగలమయమైంది… దొరకబట్టిండ్రు అంటున్నరు… యెస్… తప్పు జరిగితే శిక్షించాలని CM చెప్పారు కాబట్టే దొంగల్ని దొరకబట్టినం… మీరెప్పుడైనా దొరకబట్టిండ్రా… మీరంతా అమ్ముకున్నరు… ట్రాన్స్ పరెన్సీగా ఉన్నాం కాబట్టే తప్పు చేసినవాళ్లను జైళ్లకు పంపించాం’ అని బొత్సకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాకముందు విషం కక్కారు… తెచ్చుకున్న తెలంగాణపైనా విషం చిమ్ముతున్నారన్న గంగుల… సాయంత్రంలోగా వీటన్నిటికీ జవాబు చెప్పాలని స్పష్టం చేశారు.
‘ఉపాధ్యాయుల ట్రాన్స్ ఫర్స్ అంటే మంత్రి ఇంటి ముందు నిలబడాలె… రూ.లక్ష ఇస్తే ట్రాన్స్ ఫర్… ఇలాంటివి జరుగుతున్నాయా తెలంగాణలో’… ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి అంటూ గంగుల తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎక్కడా పైరవీలకు తావు లేకుండా ట్రాన్స్ ఫర్స్ చేస్తామంటే కోర్టుకెక్కారని… APలో ట్రాన్స్ ఫర్ కావాలంటే లక్షనో, 5 లక్షలు ఇస్తేనో ఇప్పటికీ అక్కడ బదిలీ జరుగుతుంది అని గంగుల AP మినిస్టర్ పై ఎదురుదాడికి దిగారు. ట్రాన్స్ పరెన్సీగా పనిచేస్తున్న తెలంగాణపై బొత్స సత్యనారాయణ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. విద్యావ్యవస్థపై చర్చించాకే ఆయన హైదరాబాద్ లో అడుగుపెట్టాలన్నారు. బొత్స మాటల వెనుక జగన్ సర్కారు లేకపోతే ఆయనపై చర్యలు తీసుకోవాలని… వెంటనే బర్తరఫ్ చేసి చూపించాలని డిమాండ్ చేశారు.