వారం రోజుల్లో రూ.500 గ్యాస్ సిలిండర్లను పేద కుటుంబాలకు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో.. ఆ దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. అయితే ఈ గ్యాస్ సిలిండర్ దక్కాలంటే తప్పకుండా రేషన్ కార్డు ఉండాల్సిందే. అర్హులైన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ఇక నుంచి రేషన్ కార్డులున్న వారిని వివరాలు సేకరించే పని మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో కోటీ 20 లక్షల గ్యాస్ సిలిండర్లు ఉంటే.. అందులో రేషన్ కార్డులు ఉన్నవారు 89.99 లక్షలు. అంటే ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు కలిపి ఇంకో 31 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు లేవన్నమాట.
ప్రస్తావనే లేని కొత్త కార్డులు…
ప్రతి పథకాని(Scheme)కి కొత్త రేషన్ కార్డును లింక్ చేయడంతో వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. బియ్యం, ఇతర నిత్యావసరాలను నెలనెలా అందించేందుకు పుట్టుకొచ్చిన రేషన్ కార్డులు కాస్తా… సర్కారీ స్కీమ్ ల కోసమే అన్నట్లుగా తయారయ్యాయి. దీంతో వీటి కోసం పేదలతోపాటు మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులు సైతం దరఖాస్తు చేసుకోవడం, అవి వచ్చాక దాచుకోవడం వంటివి చేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కార్డులు వృథాగా పడి ఉన్నాయి.
భారీగా అప్లికేషన్లు…
రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 89.99 లక్షలు.. కానీ గ్యాస్ సిలిండర్(Cylinder) కోసం వచ్చిన దరఖాస్తులు(Applications) 91.50 లక్షలు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కు రేషన్ కార్డే ప్రామాణికం అయినపుడు వాటికన్నా సిలిండర్లకే ఎక్కువ అప్లికేషన్లు రావడం ఆశ్చర్యకరంగా మారింది. అభయహస్తం గ్యారంటీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కోసమే భారీగా దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర జనాభా 3.95 కోట్లయితే రేషన్ కార్డుల సంఖ్య 89.99 లక్షలు. ఇలా మొత్తంగా 2.85 కోట్ల మందికి రేషన్ కార్డుల్లో పేర్లుంటే వీరి శాతం 71.5గా ఉంది. ఇక కార్డుల్లో కొత్త పేర్లు చేర్చాలంటూ 11 లక్షల అప్లికేషన్లు వచ్చాయి.
అన్నింటిని ప్రకటిస్తున్నా…
ఉచిత ప్రయాణానికి(Free Journey) మహాలక్ష్మీ, ఫ్రీ కరెంటు కోసం గృహజ్యోతి, రైతుబంధు, రైతు భరోసా(Rythy Bharosa), రూ.500 గ్యాస్ సిలిండర్ వంటివన్నీ ప్రకటిస్తున్నా… ఇప్పటికీ కొత్త రేషన్ కార్డులపై ఊసు లేకపోవడంతో సామాన్యుల్లో ఆందోళన కనిపిస్తున్నది. తమకు సర్కారీ స్కీమ్ లు దక్కుతాయో లేదోనన్న అయోమయంతో పేద కుటుంబాలు గత కొన్నేళ్లుగా ఆవేదనలోనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వమైనా వీటిపై ప్రకటన చేస్తుందని రెండున్నర నెలలుగా ఎదురుచూస్తున్నా.. ఇంకా అది రాకపోవడంతో తమకు ఆరు గ్యారంటీలు అందుతాయా అన్న సంశయంలో ఉన్నారు.