ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి(Flood Water)తో భద్రాచలం(Bhadrachalam) వద్ద ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇప్పటికే నది ఫ్లో 53 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఆందోళనకు దారితీస్తోంది. 55 అడుగులు దాటితే ముంపు భయం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే 4,000 మందిని రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఈ రాత్రికే 55 అడుగులు దాటితే మరో ఏడెనిమిది కాలనీల ప్రజల్ని తరలించాల్సి ఉంటుంది. షిఫ్టింగ్ కు సంబంధించిన అరేంజ్ మెంట్స్ చేస్తున్నామంటున్నారు. భద్రాచలం నుంచి ప్రస్తుతం 14,15,000 క్యూసెక్కుల ఫ్లడ్ కిందకు వెళ్తోంది. గతేడాది ఇదే సమయంలో 71.5 అడుగులకు నీరు చేరడంతో ఎన్నో గ్రామాలతోపాటు భద్రాచలం సైతం అతలాకుతలమైంది.
అంతకంతకూ వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో గోదావరి పరివాహకంలోని ఏరియాలతోపాటు ఏజెన్సీ ప్రాంతాల్లో భయాందోళనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ-ఛత్తీస్ గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని మండలాలకు రవాణా పూర్తిగా ఆగిపోవడంతోపాటు అధికార యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది.