ఉద్ధృతంగా పోటెత్తుతున్న వరద(Heavy Flood)తో గోదావరి తీర ప్రాంతాల్లో అలజడి కనిపిస్తున్నది. గత వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా ఘడియ ఘడియ ఓ గండలా భావిస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. భద్రాచలం వద్ద నది 54.4 అడుగులకు చేరుకోవడం, ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గతేడాది అనుభవాలు ఇంకా కళ్ల ముందు మెదులుతుండగా, మరోసారి అది రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు అందరినీ ఆవేదనకు గురిచేస్తున్నాయి.
రాత్రి నుంచి 14 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఈ రోజు పొద్దున 8:30 గంటలకు 14,92,000 క్యూసెక్కులకు చేరుకుంది. 2 అడుగుల మేర నీరు పెరుగుతూ పోయింది. దీంతో ముంపు ప్రాంతాలు పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పటికే భద్రాచలంలోని కొన్ని కాలనీల నుంచి ప్రజల్ని షిఫ్ట్ చేశారు. ముంపు ప్రాంతాలతోపాటు ఏజెన్సీ జనం భయం భయంగా గడుపుతున్నారు. ఇంచుమించు 50 దాకా రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు.