నిబంధనలు ఉల్లంఘించారంటూ DGP అంజనీకుమార్ ను ఎన్నికల సంఘం(EC) సస్పెండ్ చేసింది. అంజనీకుమార్ తోపాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన ఇద్దరు అధికారులు అదనపు DGPలు కావడం విశేషం. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ రానున్న దృష్ట్యా ఈ ముగ్గురు ఉన్నతాధికారులు రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన ఆఫీసర్లు.. ఆయనతో కాసేపు ముచ్చటించారు. అంజనీకుమార్, మహేశ్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ లకు ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపింది.
కారణం అదే అయి ఉంటుందా…
ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత అభ్యర్థులందరికీ ఎన్నికల సంఘం సర్టిఫికెట్లు అందజేస్తుంది. పూర్తిగా ఆధిక్యత సాధించిన పార్టీని ఎక్కువ సీట్లు తెచ్చుకున్న పార్టీగా గుర్తిస్తుంది. అయితే కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే DGP అంజనీకుమార్ సహా ఇద్దరు అడిషనల్ DGPలు స్వయంగా రేవంత్ ఇంటికి వెళ్లి కలిశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా గెలుపొందిన అభ్యర్థులందరికీ 2+2 సెక్యూరిటీ కేటాయించాలంటూ స్వయంగా డీజీపీయే అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ ఆచరణలో పెట్టాలంటే ముందుగా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ పూర్తయ్యేంతవరకు జరిగే పరిణామాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘం కనుసన్నల్లో పనిచేసే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నిశితంగా దృష్టిపెడుతుంది. ఇలా ముగ్గురు ఉన్నతాధికారులు(Higher Officials) ఎలాంటి పర్మిషన్ లేకుండా నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతోనే చర్యలకు EC సిద్ధమైనట్లు తెలుస్తున్నది.