అధికారంలోకి వస్తే ‘ధరణి’ పోర్టల్ ను ఎత్తివేసి భూ యాజమాన్య హక్కుల్ని అందుబాటులో ఉంచుతామని ప్రకటించిన మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. తహసీల్దార్లు, RDOలకు అధికారాలని బదలాయిస్తూ మార్గదర్శకాలు(Guidelines) జారీ చేసింది. ఏయే అధికారులకు ఎలాంటి అధికారాలు ఉంటాయో అందులో స్పష్టం(Clarity) చేసింది. జిల్లా స్థాయి అధికారులతో పాటు CCLA ఉన్నతాధికారులకు బాధ్యతలు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. భూమి తమదై ఉన్నప్పటికీ తమ అధీనంలో లేకుండా ఇబ్బంది పడుతున్న యజమానులకు విస్పష్టంగా హక్కులు బదలాయించడమన్నది తాజా గైడ్ లైన్స్ లో పొందుపరిచారు. ‘ధరణి’లో సవరింపుల కోసం ఇప్పటివరకు 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి.
మండలాల్లోనే మూడు కమిటీలు…
ఈ మార్గదర్శకాలతో ఇక ‘ధరణి’ విధులు అధికారుల చేతుల్లో ఉండనున్నాయి. ఎం.కోదండరెడ్డి ఆధ్వర్యంలో ‘ధరణి’పై ఏర్పడిన కమిటీ ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భూమి తమ ఆధీనంలో ఉన్నప్పటికీ ‘ధరణి’ వెబ్ సైట్ లో వేరే పేరు ఉండటంతో వేలాది మంది యజమానులు గత కొన్నేళ్లుగా తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఇలాంటి సమస్యలు ఎలా పరిష్కారం చేపట్టాలన్న దానిపై మండల స్థాయిలోనే మూడు కమిటీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామస్థాయిలోని సిబ్బంది సహకారంతో దరఖాస్తులో తెలియజేసిన ఆధారాలు సరైనవా, కావా అన్న కోణంలో తహసీల్దార్, డిప్యుటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్ పెక్టర్ ఆధ్వర్యంలోని మూడు కమిటీలు విచారణ నిర్వహించి ఈ కమిటీలు నిర్ణయం తీసుకోనున్నాయి. ఇందుకోసం ఈ మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
పూర్తి బాధ్యత వారిదే…
‘ధరణి’ సమస్యల్ని పరిష్కరించేందుకు పూర్తి బాధ్యతల్ని జిల్లా కలెక్టర్లు, RDOలకు అధికారాలు కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డివిజన్ లెవెల్లో RDOలు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు, రాష్ట్రస్థాయిలో CCLA(Chief Commissioner Of Land Administration) ఉన్నతాధికారులు బాధ్యతలు చూసేలా గైడ్ లైన్స్ తయారయ్యాయి. భూ హక్కులు అసలైన లబ్ధిదారుల్లో ఏ ఒక్కరికీ దూరంగా కాకుండా ఉండేలా చూడాలంటూ ‘ధరణి’ కమిటీ పలు సిఫార్సులు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రజలవే కాకుండా ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూముల పరిష్కారంపైనా అధికారులు దృష్టి పెట్టే వీలు కల్పించింది.
పరిశీలించే అంశాలివే…
మండల స్థాయిలోని మూడు కమిటీలు గ్రామాల వారీగా భూ హక్కుదారులను పరిశీలిస్తారు. ఇందుకోసం వీరు సేత్వార్(ల్యాండ్ రికార్డ్స్), ఖాస్రా పహాణీ, సీస్లా పహాణీ, పాత పహాణీ, ధరణి 1బి రిజిస్టర్.. ఇలా వీటన్నింటినీ పరిశీలన చేస్తారు. అసైన్ మెంట్ / ఇనాం / PoT రిజిస్టర్స్ / భూదాన్, ఎండోమెంట్, వక్ఫ్ భూములపై దృష్టి సారిస్తారు. పట్టాదారు పాసు పుస్తకాల్లో డేటా కరెక్షన్ కోసం లక్షకు పైగా అప్లికేషన్లు ఉండగా.. 17 రకాల మాడ్యూల్స్ కోసం వచ్చిన అప్లికేషన్లు మొత్తంగా 2.45 లక్షలు ఉన్నాయి.
పెండింగ్ అప్లికేషన్లు మొత్తం 2,45,037
17 రకాల మాడ్యూల్స్ సవరణలు – 2,45,037 అప్లికేషన్లు
పట్టాదారు పాసు పుస్తకాల్లో డేటా కరెక్షన్ – 1,00,000 అప్లికేషన్లు
నిషేధిత జాబితా పార్ట్-బి – 13.38 లక్షల ఎకరాలు
కారణాలు లేకుండా నిషేధిత లిస్టు – 5.07 ఎకరాలు