Published 11 Nov 2023
రాష్ట్రంలో విచ్చలవిడిగా విక్రయాలు సాగుతూ యువతను నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల(Drugs)పై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇక నుంచి డ్రగ్స్ దొరికితే లోపల పడేయండంటూ వార్నింగ్ ఇచ్చింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేసి డ్రగ్స్ ను కంట్రోల్ చేయాలని ఆదేశించారు. వీటిని వినియోగించినా, విక్రయించినా మీ ప్రతాపం చూపించండంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు. KCR సర్కారు నిర్లక్ష్య వైఖరిపై ప్రతిపక్ష నేతగా గట్టి గళం వినిపించిన రేవంత్.. అధికారం చేపట్టిన వారం లోపే మత్తు పదార్థాల అమ్మకాలపై దృష్టి పెట్టారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో మత్తు పదార్థాల దందా విచ్చలవిడిగా పెరిగిపోతోంది. చాలా చోట్ల డ్రగ్స్ దొరికినా పెద్దగా కేసులు బయటకు రావడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ మధ్యకాలంలో సినీ నటులు ఎక్కువగా డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్నా పైరవీలతో అవి బయటకు రాకుండా చేస్తున్నారు. మరోవైపు ఈ అక్రమ దందా వల్ల యువతతోపాటు విద్యార్థులు కూడా పక్కదారి పడుతున్నారన్న ప్రచారం ఆందోళనకర స్థితిని తెలియజేస్తోంది. పూర్తిస్థాయిలో కేసులు నమోదు చేసి నిందితుల్ని రిమాండ్ కు తరలిస్తే తప్ప ఈ దందాకు అడ్డుకట్ట పడదు.