ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఏడాది కావస్తున్నా నియామక పత్రాలు ఇవ్వలేదంటూ 2008 DSC అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. ప్రజాభవన్ కు భారీ సంఖ్యలో చేరుకుని అక్కడే బైఠాయించారు. 15 సంవత్సరాల సమస్యను పరిష్కరిస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే ఉద్యోగాలు ఎప్పుడు కేటాయిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. DSC 2008 బాధితులకు కొలువులు కేటాయిస్తామని గతేడాది ఫిబ్రవరిలో రాష్ట్ర మంత్రివర్గం(Cabinet) నిర్ణయం తీసుకుంది. దీనిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఆదేశాల ప్రకారం 2024 సెప్టెంబరులో రాష్ట్రవ్యాప్తంగా 1,399 మంది ధ్రువపత్రాల పరిశీలన(Certificate Verification) పూర్తయింది.
ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా ఎప్పుడెప్పుడా అంటూ అప్పట్నుంచి వారంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పటికే ప్రైవేటు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డామంటున్న బాధితులు.. తమను సర్కారే ఆదుకోవాలంటూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజాభవన్ కు చేరుకున్నారు. కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించే వరకు కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి నియామక పత్రాలు అందజేసి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.