ధ్రువపత్రాల(Certificate) పరిశీలన(Verification) పూర్తయి 50 రోజులు గడుస్తున్నా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వట్లేదంటూ 2008 DSC బాధితులు ఆవేదనతో ప్రజాభవన్ కు చేరుకున్నారు. వివిధ జిల్లాలకు చెందిన 200 మంది అభ్యర్థులు ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డిని కలిశారు. 15 ఏళ్ల తమ కల సాకారం చేసినందుకు సర్కారుకు ధన్యవాదాలు చెబుతూనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎలా పూర్తి చేశారో ఆ తరహాలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వాలని అభ్యర్థించారు. రాష్ట్రవ్యాప్తంగా వెరిఫికేషన్ పూర్తయిన 1,400 మందికి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇవ్వాలన్నారు.
ప్రభుత్వ కొలువులు వస్తాయన్న ఆశతో ప్రైవేటు ఉద్యోగాలు వదిలేసినట్లు బాధితులంతా చిన్నారెడ్డికి తెలిపారు. DSC 2008 సాధన సమితి నుంచి వివరాలు తీసుకున్న ఆయన.. విద్యాశాఖ కమిషనర్ నర్సింహారెడ్డితోపాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో మరోసారి యంత్రాంగంతో చర్చించి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.