కొత్త నోటిఫికేషన్… పోస్టుల సంఖ్య రెట్టింపుతో… డీఎస్సీ నోటిఫికేషన్(Notification) విడుదలైంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. నిరుద్యోగులు ఎంతోకాలంగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష(DSC) ప్రకటన కోసం అధికారులు వారం రోజులుగా సమాలోచనలు చేస్తున్నారు. గ్రూప్-1 మాదిరిగానే మరిన్ని పోస్టులు కలిపి కొత్తగా ప్రకటన ఇచ్చారు. ఈ మెగా DSCకి అప్లయ్ చేసుకునేందుకు మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు గడువునిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
BRS ప్రభుత్వ హయాంలో గతేడాది 5,089 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ నోటిఫికేషన్ ను నిన్న రాత్రి రద్దు చేసిన విద్యాశాఖ… దానికి మరిన్ని పోస్టుల్ని జత చేసి మరోసారి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టుల సంఖ్య పెంచాలంటూ బీఎడ్, డీఎడ్ క్యాండిడేట్స్ గతంలోనే పెద్దయెత్తున ఆందోళనలు చేపట్టారు. అప్పటి CM కేసీఆర్.. అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 13,500 పోస్టుల్ని రిక్రూట్ చేయాలంటూ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ ను ముట్టడించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ సర్కారు.. పోస్టుల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 11,062 ఉద్యోగాలకు ప్రకటన వచ్చింది. ఇందుకు అప్లయ్ చేసుకోవడానికి ఫీజును రూ.1,000గా నిర్ణయించింది విద్యాశాఖ.
అంతా నూతనంగా…
గత ప్రకటనకు 5,973 అదనపు పోస్టుల్ని కలిపి మళ్లీ కొత్తగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే గతంలో 5,089 పోస్టులుంటే ఈసారి అంతకన్నా ఎక్కువగా 5,973 పోస్టుల్ని జత చేసి తాజా ప్రకటన వెలువరించింది. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ల(SGT)లకు అత్యధికంగా పోస్టులున్నాయి. గత డీఎస్సీలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్లను ఈ కొత్త డీఎస్సీకి బదిలీ(Forward) చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గతంలో అప్లై చేసుకున్నవాళ్లు మళ్లీ ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన విధివిధానాలు, ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపకల్పనపై విద్యాశాఖ దృష్టిపెట్టింది.
మంజూరైన పోస్టులు.. కేటగిరీల వారీగా
స్కూల్ అసిస్టెంట్లు – 2,629
సెకండరీ గ్రేడ్ టీచర్లు, – 6,508
పీఈటీ లు – 182
లాంగ్వేజ్ పండిట్స్ – 727
స్కూల్ అసిస్టెంట్లు(స్పెషల్ ఎడ్యుకేషన్) – 220
SGT(స్పెషల్ ఎడ్యుకేషన్) – 796