
Published 27 Nov 2023
పోస్టల్ బ్యాలెట్(Postal Ballot)లు అందుతాయో లేదోనన్న అనుమానంతో ఉన్న ఉద్యోగుల విషయంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజులుగా నెలకొన్న అయోమయానికి తెరదించుతూ.. ఉద్యోగుల విన్నపాల్ని పరిగణలోకి తీసుకుంటూ సమస్య పరిష్కారానికి నడుం బిగించింది. ఎన్నికల విధుల్లో(Election Duties) పాల్గొనే ఉద్యోగుల్లో పోస్టల్ బ్యాలెట్ అందనివారు.. రిటర్నింగ్ అధికారిని సంప్రదించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(Chief Electoral Officer) వికాస్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. ఓటు హక్కు ఉన్న నియోజకవర్గానికి సంబంధించిన ROను సంప్రదిస్తే బ్యాలెట్ పేపర్ ఇస్తారని తెలియజేశారు. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ చూపి పోస్టల్ బ్యాలెట్ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. మరోవైపు ఫెసిలిటేషన్ సెంటర్ లోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు.
అయోమయం, గందరగోళానికి తెర
ఎన్నికల విధులకు అటెండ్ అయ్యే 3 లక్షల మంది సిబ్బందికి గాను 1.60 లక్షల పోస్టల్ బ్యాలెట్లు మాత్రమే అందుబాటులో ఉండటం, డ్యూటీ చేసే చోట కాకుండా RO కార్యాలయాల్లో బ్యాలెట్ ను ఇవ్వాల్సి రావడంతో ఉద్యోగుల్లో అయోమయం, గందరగోళం ఏర్పాడ్డాయి. దీనిపై బాహాటంగానే ఎంప్లాయిస్ యూనియన్లు నిరసన వ్యక్తం చేశాయి. తమను ఓటు వేయకుండా కావాలనే చేస్తున్నారా అన్న అనుమానాల్ని సైతం బయటపెట్టారు. ఇలాంటి అసందిగ్ధ పరిస్థితుల్లో ఏకంగా వికాస్ రాజ్ నే కలిసిన ఉద్యోగ సంఘాల లీడర్లు.. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిణామాల్ని వివరించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే ఎలక్షన్ కమిషన్ కే చెడ్డపేరు వస్తుందని గమనించిన ఈసీ ఉన్నతాధికారులు.. ఎట్టకేలకు బ్యాలెట్ అందించాలన్న ఫైనల్ డిసిషన్ కు వచ్చేశారు.