Published 02 Dec 2023
ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన DA విషయంలో ఎన్నికల సంఘం పాజిటివ్ గా రెస్పాండ్ అయింది. డీఏ విడుదలకు అనుమతి ఇస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పెండింగ్ లో ఉన్న ఒక డీఏ విడుదలకు గాను ప్రభుత్వానికి EC గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సంఘం ఆమోదించడంతో ఉద్యోగులకు చెల్లించాల్సిన DAకు సంబంధించిన ఆర్డర్స్ ను విడుదల చేసేందుకు సర్కారు సిద్ధమవుతున్నది.
రేపు ఎన్నికల ఫలితాలు రానున్న దృష్ట్యా ప్రభుత్వ లావాదేవీలపై కన్నేసి ఉంచాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ECకి ఫిర్యాదు చేసింది. రైతుబంధు నిధులైన రూ.6,000 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులకు చెల్లించాల్సిన DAపై ఆలోచన ఉన్నా ఈసీ అంగీరిస్తుందా అన్నది సంశయంగా మారింది. ప్రభుత్వం ప్రతిపాదన పంపడం ఒకవైపు.. కేసీఆర్ సర్కారు తీరుపై ఈ రోజు హస్తం పార్టీ నేతలు కంప్లయింట్ ఇవ్వడం మరోవైపు.. ఇలాంటి పరిణామాలతో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతే డీఏ వస్తుండొచ్చు అని ఉద్యోగ సంఘాలు భావిస్తున్న తరుణంలో EC గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సందేహాలకు తెరపడింది.