Published 28 Nov 2023
పోలింగ్ కు మరో 48 గంటల సమయమే ఉన్నందున దాన్ని సక్సెస్ చేయాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలిగేలా ఎన్నికల సంఘం దృష్టిపెట్టింది. ఎల్లుండి జరిగే కార్యక్రమం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. వికాస్ రాజ్ అధ్యక్షతన సాగిన ఈ భేటీలో జిల్లాల ఎలక్షన్ ఆఫీసర్స్(DEO) పాల్గొన్నారు. పోలింగ్ సిబ్బందికి సామగ్రి అందజేసినప్పటి నుంచి EVMలు స్ట్రాంగ్ రూమ్ లకు తరలించే వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ప్రతి జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారితోపాటు ROల సునిశిత దృష్టి ఉండాలని, అత్యవసరంగా బలగాలు తరలించాల్సి వస్తే వెంటనే సమాచారం అందించాలని స్పష్టం చేశారు.
EVMల్లో సాంకేతిక సమస్యలు(Technical Problems) ఏర్పడితే వెంటనే వాటిని సరిచేయాలని, ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఎక్కడా మైక్ ల సౌండ్ కనిపించకూడదని వికాస్ రాజ్ DEOలను ఆదేశించారు. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి పోలింగ్ ను సక్సెస్ ఫుల్ గా ముగిస్తే ఎన్నికల సంఘానికి ప్రజల్లో మంచి పేరు వస్తుందన్న విషయాన్ని అధికారులందరికీ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. అటు వికాస్ రాజ్ తోపాటు SEC అధికారులందరితో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. ఇవాల్టి నుంచి అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేసింది.