Published 29 Nov 2023
ఎన్నికల ప్రచారం(Election Campaign)లో నోరు పారేసుకునే నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ గా దృష్టి పెట్టింది. ప్రజలను ప్రలోభాలకు గురి చేసే ఎలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, మంత్రుల విషయంలోనూ గట్టిగా వ్యవహరించిన EC.. ఈసారి హుజూరాబాద్ అభ్యర్థిపై ఫోకస్ పెట్టింది. ప్రచారంలో భాగంగా నిన్న భావోద్వేగంగా మాట్లాడిన అక్కడి BRS అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు పంపింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై నివేదిక కోరిన ఎలక్షన్ కమిషన్.. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై హుజూరాబాద్ ఎన్నికల అధికారులు పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి, సదరు వీడియోల్ని పరిగణలోకి తీసుకుని రిపోర్ట్ అందజేయబోతున్నారు. అటు కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డిపై కేసు ఫైల్ అయింది. నిబంధనలు ఉల్లంఘించారని MPDO ఇచ్చిన కంప్లయింట్ తో పోలీసులు కేసు ఫైల్ చేశారు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌశిక్ రెడ్డి.. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు అధికార BRSలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసి BJP అభ్యర్థి ఈటల రాజేందర్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన్ను MLCగా నియమిస్తూ ఆర్డర్స్ ను ప్రభుత్వం గవర్నర్ కు పంపింది. కానీ ఆయనకు గవర్నర్ కోటాలో ఎలాంటి అర్హతలు లేవంటూ సర్కారీ విజ్ఞప్తిని తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. ఈ అంశం రాష్ట్రంలో పెద్ద వివాదానికి దారితీసి రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెంచింది. అయితే ఈ ఎన్నికల్లో మరోసారి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నుంచే పోటీ చేస్తుండగా.. మంగళవారం నాడు ప్రచారంలో తనకు ఓటేయకుంటే ఏదో చేసుకుంటామని మాట్లాడారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఎలక్షన్ కమిషన్ స్పందించి విచారణకు ఆదేశించింది.