అసలు ప్రచారాల కన్నా ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారాలే దుమ్మురేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన ప్రకటనలు(Advertisements) ప్రధానంగా ముఖ్యమంత్రి KCRను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. భారత్ రాష్ట్ర సమితి(BRS) పాలనపై తయారైన అడ్వర్టయిజ్మెంట్లతో దూసుకుపోతున్న హస్తం పార్టీకి ఇప్పుడు షాక్ తగిలింది. వివాదాస్పద ప్రకటనలంటూ ఎన్నికల సంఘం(EC) షాక్ ఇస్తూ.. వాటిపై బ్యాన్డ్(Banned) ముద్ర వేసింది. గులాబీ రంగు కారుతో సీఎంను పోలిన వ్యక్తి ప్రజల్లోకి వెళ్లడం, అక్కడ నానాయాగీ జరిగి నేతలపై ప్రజలు విమర్శలు చేస్తున్నట్లుగా చూపించడం, చివరకు కారు టైర్ గాలి దిగిపోవడం సాధారణంగా చూస్తున్నాం. అయితే ఇవి అభ్యంతరకరంగా ఉన్నాయంటూ BRS లీగల్ సెల్ తరఫున ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వచ్చింది. ఇటు మీడియా సంస్థలకు సైతం లెటర్లు రాసిన లీగల్ సెల్.. కాంగ్రెస్ యాడ్స్ ను నిలిపివేయాలని స్పష్టం చేసింది.
PHOTO: CONGRESS POST IN (‘X)
CEOను కలిసిన లీగల్ సెల్ కన్వీనర్
యాడ్స్ పై ‘బ్యాన్డ్’ అని ముద్రించిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రకటనలు సదరు ముద్రతోనే టెలికాస్ట్ అవుతున్నాయంటూ BRS లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ మరోసారి ECకి కంప్లయింట్ ఇచ్చారు. CEO వికాస్ రాజ్ ను కలిసి వాటిని ప్రసారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అటు ఉద్రిక్తతలకు కారణమవుతున్న కాంగ్రెస్ పార్టీ యాడ్స్ తోపాటు రేవంత్ రెడ్డిపైనా చర్యలు తీసుకోవాలని.. నాయకులు కార్యకర్తలను రెచ్చగొడుతున్న PCC ప్రెసిడెంట్ పై ఎన్నికల నియమావళి మేరకు నిషేధం విధించాలని కోరారు.
కాంగ్రెస్ విమర్శలు
మీడియాలో కాంగ్రెస్ ప్రచార ప్రకటనలపై ఎన్నికల సంఘం నిషేధం విధించడం మీద హస్తం పార్టీ మండిపడింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా యాడ్స్ పై బ్యాన్డ్ అని ముద్ర వేయడం సరికాదని కామెంట్ పెట్టింది. ఓటమి భయం పట్టుకున్న BRS, BJP ఒత్తిడితోనే EC ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపించింది.