మాజీ CM కేసీఆర్ కూతురు, MLC కల్వకుంట్ల కవిత ఇంట్లో ఐటీ సోదాలు(IT Raids) జరుగుతున్నాయి. బంజారాహిల్స్ లోని ఆమె నివాసానికి చేరుకున్న IT అధికారులు.. పెద్దయెత్తున సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోకి ఎవ్వరినీ అనుమతించకుండా భారీ బందోబస్తు పెట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందమే సోదాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో సోదాలు జరుగుతున్నాయి.
తొలుత ఐటీ అంటూ…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమెకు ఇప్పటికే ED, CBI నోటీసులు జారీ చేసింది. కానీ ఆమె విచారణకు హాజరుకాకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తొలుత ఆమె నివాసానికి IT అధికారులు వచ్చి తనిఖీలు చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ వచ్చింది ITతోపాటు ED అధికారులని తేలింది. పటిష్ఠ బందోబస్తు నడుమ అక్కడికి ప్రవేశించిన అధికారుల టీమ్.. అక్కడున్నవారి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుంది.
కేసు ఇలా…
APకి చెందిన YCP ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బినామీలైన అరుణ్ రామచంద్ర పిళ్లై, ప్రేమ్ రాహుల్ కు చెందిన సౌత్ గ్రూప్ ద్వారా… ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లకు రూ.100 కోట్ల ముందస్తు ముడుపులు చెల్లించి మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా ఉండేలా కల్వకుంట్ల కవిత ప్రభావితం చేశారన్నది ED అభియోగం. దీనిపై ఇప్పటికే పలుమార్లు ED నోటీసులు పంపినా ఆమె విచారణకు హాజరు కాలేదు. చట్ట ప్రకారం మహిళల్ని ఇంట్లోనే విచారించాల్సి ఉన్నా ఆఫీసుకు ఈడీ పిలవడాన్ని సవాల్ చేస్తూ కవిత.. 2023 మార్చి 14న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ నడుస్తుండగానే అటు CBI సైతం నోటీసులు పంపింది. ఈ రెండు దర్యాప్తు సంస్థల నోటీసులపై విచారణ జరపాలని సుప్రీంను మరోసారి కవిత లాయర్లు కోరారు. ఆమె పిటిషన్ ను మరో ఇద్దరైన నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీల కేసులకు తొలుత జత చేయగా.. ఆయా పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపడతామని తర్వాత ధర్మాసనం స్పష్టతనిచ్చింది. జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం(Devision Bench) కవిత కేసు విచారణ చేపట్టింది.