కొత్త వ్యాపారాలు(Business) ప్రారంభించాలన్నా, అవి బాగా నడవాలన్నా దసరా, దీపావళి పండుగల్ని శుభ సూచకంగా భావిస్తారు. దశమికి మొదలుపెడితే దశ తిరుగుతుందని, దీపావళికి మహాలక్ష్మీదేవియే ఇంట్లోకి వస్తుందన్నది అందరి నమ్మకం. అందుకే బంగారం, వాహనాలు, వస్తువులు ఏది కొనాలన్నా మంచి రోజులనే చూస్తారు. దసరా, దీపావళి తర్వాత వచ్చేది కార్తిక మాసం కాబట్టి ఇక అన్నీ శుభకార్యాలే ఉంటాయి. అందుకే ఏ శుభకార్యం నిర్వహించాలన్నా రెండు మూడు నెలల ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. ఫంక్షన్ హాల్స్, బంగారం, బట్టలు, ఇతర వస్తువులు(Items) కొనుగోళ్లు చేస్తుంటారు. అంతకాలం దాచుకున్న డబ్బంతా ఈ రోజుల్లోనే బయటకు తీస్తుంటారు. ఇలాంటి మంచి రోజుల్లోనే ఎన్నికలు రావడం అందరికీ ఇబ్బందులు తెచ్చిపెడుతున్నది.
బంగారం కొనలేం, అమ్మలేం..
ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు రూ.63,000, వెండి రూ.72,000 దాకా పలుకుతున్నది. ఒక పెళ్లి చేయాలంటే ఎంత లేదన్నా కనీసం 5 తులాలు(50 గ్రాముల)కు తక్కువ కాకుండా చూస్తారు. పుస్తెలు, ఉంగరాలు, గొలుసు అన్నీ చేయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 50 గ్రాముల పసిడికి రూ.3 లక్షలకు పైగా ఖర్చవుతుంది. ఎలక్షన్ కోడ్ దృష్ట్యా రూ.50,000కు మించితే లెక్కలు చూపించాల్సి ఉండగా.. సామాన్యులు తీవ్రంగా భయపడుతున్నారు. వీటికి లెక్కలు ఎలా చూపించాలంటూ తలలు పట్టుకుంటున్నారు.
వ్యాపారుల నానా అవస్థలు
బడా వ్యాపారుల చేతిలో GST బిల్లులు ఉంటాయి కాబట్టి వాళ్లకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎటొచ్చీ చిన్న వ్యాపారులకే కష్టాలు ఎదురవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దసరా, దీపావళి, కార్తిక మాసాల్లో భారీగా బంగారం, బట్టలు కొంటుంటారు. కొన్న బంగారంతో నగలు చేయించుకునేందుకు వ్యాపారుల వద్దకు వెళ్తే అక్కడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ డబ్బును షాప్ దాకా తీసుకెళ్లడం ఒకెత్తు కాగా.. సదరు వ్యాపారులు సైతం ఇతర ప్రాంతాల్లోని కూలీలతో పనిచేయిస్తుంటారు. కోడ్ వల్ల బంగారాన్ని హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లే అవకాశం లేకుండా పోతున్నది. 100 గ్రాముల బంగారాన్ని హైదరాబాద్, లేదా కరీంనగర్, వరంగల్ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే రసీదులు చూపించాలి. కానీ చిరు వ్యాపారుల వద్ద రసీదులు ఏముంటాయి.. అందుకే పండుగ సీజన్లలో ఎలక్షన్ కోడ్ రావడం అందర్నీ ఇబ్బందుల పాలు చేస్తోంది.