Published 28 Nov 2023
తెలంగాణ శాసనసభ(Telangana Assembly)కి జరిగే ఎన్నికల కోసం అయ్యే ఖర్చు రూ.150 కోట్లు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్న పెరుగుతున్న అంచనాలను బట్టి బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఈసారి అంతకు అయిదు రెట్ల నగదు పట్టుబడింది. ఇప్పటివరకు రూ.724 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఇందులో సామాన్యులది సగం తీసేసినా మరో రూ.300 కోట్ల దాకా అక్రమ సొమ్ము అయే ఉంటది. దేశంలో ఎలక్షన్లు జరుగుతున్న 5 రాష్ట్రాల్ని పరిశీలిస్తే ఇప్పటివరకు రూ.2,000 కోట్ల దాకా పట్టుబడగా.. అందులో మూడో వంతుకు పైగా తెలంగాణలోనే దొరకడం ఆశ్చర్యకరంగా మారింది. ఓట్ల కోసం ఇక్కడి పార్టీల నేతలు ఎన్ని జిత్తుల మారి వేషాలు వేస్తున్నారో దీన్ని బట్టే అర్థమవుతున్నది.
ఇక పంపకాలకు రెడీ
ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ మాత్రం సొత్తు స్వాధీనమైతే.. ఇక పోలింగ్ జరిగే మరో రెండు రోజుల పాటు విస్తృతంగా నిఘా పెడితే అంతకన్నా ఎక్కువగా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్, థర్డ్ కేడర్ లీడర్లు, గ్రామీణ ప్రాంతాల్లోని నాయకులపై ఫోకస్ పెడితే పెద్దయెత్తున నగదు చిక్కే అవకాశముంది. ఇప్పటికే చీరలు, గిఫ్ట్ లు, మద్యం పంచిపెట్టిన ఆయా పార్టీల అభ్యర్థులు.. ఈ 48 గంటల్లో నేరుగా నగదును ఓటర్లకు చేరవేసేందుకు సిద్ధం చేసుకున్నారు. ఒక్కో ఓటుకు ఇంత అన్నట్లుగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంత అన్న తీరుగా పంపకాలు సాగిపోనున్నాయి. పంపకాల్లో తేడాలుండొచ్చు కానీ.. పంపకాలకు దూరంగా ఉండే పార్టీ లేదంటే అతిశయోక్తి కాదేమో.
ఊరూరా నిఘా ఉంటేనే
ఇప్పటివరకు వెహికిల్ చెకింగ్స్, అనుమానం వచ్చిన లీడర్స్ పైనే ఎలక్షన్ స్క్వాడ్స్, ఐటీ బృందాలు కన్ను పెట్టాయి. కానీ దీన్ని మరింత విస్తృతం చేసి స్థానిక సిబ్బందితో గ్రామీణ ప్రాంతాల్లో దృష్టి పెడితే ఎక్కడికక్కడ నగదు, మద్యం, గిఫ్ట్ లు దొరికే అవకాశముంటుంది. మరి ఈ స్థాయిలో నిఘా పెట్టడం ECకి సాధ్యమా అన్నది క్వశ్చన్ మార్క్. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఆన్ లైన్ లావాదేవీలు నార్మల్ కన్నా నాలుగు రెట్లు పెరిగినట్లు బ్యాంకులు చెబుతున్నాయి. ఇప్పుడిక ఆన్ లైన్ కన్నా ఆఫ్ లైన్ లో డబ్బును ఓటర్లకు అందించే పనిలో ఉన్నారు. పల్లెటూళ్లలో స్మార్ట్ ఫోన్లు వాడేవారు ఎక్కువగా లేకపోవడంతో ఆ డబ్బును కవర్లలో పెట్టి ఇచ్చే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తే ఇప్పట్నుంచి రికవరీ చేసే ఆదాయంతో ఇంకో రెండు మూడు ఎన్నికలను కూడా పూర్తి చేసుకోవచ్చు.