Published 28 Nov 2023
ఇంతకాలం జరిగింది ఒకెత్తు.. ఈరోజు జరిగేది మరొకెత్తు. చేసింది చెప్పుకోవడం, బతిమిలాటలు, బుజ్జగింపులు, ఓదార్పులు ఇప్పటివరకు చూశాం. కానీ ఈరోజు జరిగేది మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఒకరకంగా ఈ ఎన్నికల్లో అసలు కథంతా ఈ రాత్రికే జరిగిపోయే అవకాశముంది. నామినేషన్లు మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా ఓటర్లను బహిరంగంగా(సభలు, సమావేశాల ద్వారా) కలుసుకున్న పార్టీలు ఇప్పుడు అంతర్గతంగా భేటీ అయ్యే ఏర్పాట్లు చేసుకున్నాయి. వాస్తవానికి ఒక పెద్ద పార్టీ వ్యూహం(Strategy) చూస్తే గత ఉప ఎన్నికల్లో… పోలింగ్ కు రెండు రోజుల ముందే హడావుడి ఉన్న టైమ్ లోనే డబ్బులు పంచేసింది. ఇక మిగతా పార్టీలు ఆ 48 గంటల్లో పంచుదామనేలోపే సదరు తెలివిగల పార్టీ అధికారులకు ఫిర్యాదులు చేసింది. ఇంకేముంది.. వీళ్ల పంచుడు పూర్తయింది కానీ.. మిగతా రెండు పార్టీల పంచుడు మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆ పార్టీ ఇప్పుడు వ్యూహాన్ని మార్చినట్లే కనపడుతున్నది. ప్రచారాలు బంద్ అయ్యే ఈ రోజే తమ పని చల్లగా కానిచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం.
కునుకు తీసే టైమ్ లో కళ్లు తెరుస్తారు
దీన్నిబట్టి అర్థమవుతున్నదేంటంటే.. ఈ రాత్రికే అసలు కథ జరిగిపోనుంది. సాయంత్రానికి ప్రచారం పరిసమాప్తి అవుతుంది. బందోబస్తులో ఉండే పోలీసులు, ఇతర పనుల్లో ఉండే అధికారులు అలసిపోయి ఉంటారు. కాబట్టి సాయంత్రం తర్వాత కాస్త రెస్ట్ తీసుకునే సమయంలో పెద్దగా నిఘా ఉండదు కాబట్టి.. ఈ రోజే పని పూర్తి కానిచ్చేయాలన్న ఉద్దేశంతో కనిపిస్తున్నారు. ఈ సారి ఆ ఒక్క పార్టీయే కాదు.. మిగతా ప్రధాన పార్టీ కూడా పెద్ద పెద్ద పాచికలే సిద్ధం చేసుకున్నట్లు కనపడుతున్నది. దీంతో ఈ రాత్రికి డబ్బు పంపకాల్లో ఎన్ని డిష్యుం డిష్యుంలుంటాయోనన్న భావన నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రెండు విడతల్లో పని పూర్తి చేశారు. చీరలు, గిఫ్ట్ లు అందించిన అభ్యర్థులు ఇక ఫైనల్ విడతగా నేరుగా డబ్బులు పంపిణీ చేసే పనిలో పడ్డారు. ఒకరకంగా యంత్రాంగమంతా కునుకు తీసే టైమ్ లో వీళ్లు కళ్లు తెరుస్తారన్నమాట.
నిన్నటికి భిన్నంగా ఈరోజు
వాస్తవానికి నిన్ననే పెద్దయెత్తున పంపకాలు పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఎప్పుడూ ఒకే వ్యూహాన్ని అమలు చేస్తే దెబ్బతింటామన్న ఉద్దేశంతో దాన్ని ఈరోజుకు పెండింగ్ లో పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక సెగ్మెంట్లలో రెండు పార్టీల మధ్య పోరు పీక్ స్టేజ్ కు చేరుకుంది. కాబట్టి ఓటర్ల కోసం వేలం పాట పాడిన రీతిలో నువ్వింతంటే నేనింత అన్నట్లుగా రెచ్చిపోయి డబ్బులు పంచే అవకాశాల్ని కొట్టిపారేయలేం. అధికారాన్ని దక్కించుకునేందుకు ఇంతకన్నా మంచి ఛాన్స్ లేదన్నది ఆ పార్టీల ఆలోచనగా ఉన్నట్లు కనపడుతుంది. ‘ఇక్కడ ఆ పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది.. రెండు క్యాండిడేట్లకు పడే ఓట్ల మధ్య పెద్దగా తేడా ఉండకపోవచ్చు’ అనే చోట భారీగా నగదు ముట్టజెప్పే అవకాశాలున్నాయి. ఈరోజు, రేపు పూర్తి నిఘా పెడితేనే డబ్బు పంపిణీకి అడ్డుకట్ట వేసే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ఇక ఓటర్ల తీరును మార్చే వారే ఉండరు.