Published 25 Dec 2023
హైదరాబాద్ లో కొన్ని రోజులుగా తీవ్రమైన చలి నమోదవుతోంది. రోజూ అర్థరాత్రి నుంచి పొద్దున దాకా భారీగా మంచు పడుతుండటంతో దారి కనపడని పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి వాతావరణంలో విమానాలు గమ్యస్థానానికి చేరుకోలేని సమస్య కనిపించింది. శంషాబాద్ విమానాశ్రయానికి(Airport) చేరుకోవాల్సిన విమానాలను ఇబ్బందికర పరిస్థితుల్లో తిప్పి పంపాల్సి వచ్చింది. దట్టమైన పొగ మంచు అలుముకోవడంతో పలు విమానాల్ని వచ్చిన చోటుకే తిప్పి పంపారు. మరికొన్ని విమానాల్ని శంషాబాద్ కు బదులు ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం ఎయిర్ పోర్టుకు మళ్లించారు. ఇలా గన్నవరానికి మళ్లించిన మూడు ఫ్లైట్ లను అత్యవసర ల్యాండింగ్ కు అనుమతించగా.. మొత్తంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్(RGIA) నుంచి మళ్లించిన విమానాల సంఖ్య ఐదుకు చేరుకుంది.
ఛండీగఢ్, కేరళలోని తిరువనంతపురంతోపాటు గోవా నుంచి హైదరాబాద్ కు చేరుకున్న విమానాలకు ఏటీసీ(Air Traffic Control) పర్మిషన్ దొరకలేదు. విపరీతమైన పొగ మంచు ఏర్పడటం, రన్ వేపై ఇబ్బందికర వాతావరణం ఉండటంతో ఈ మూడు ఫ్లైట్ లను అత్యవసర ల్యాండింగ్ కోసం గన్నవరం మళ్లించారు. ఇక బెంగళూరు-హైదరాబాద్ విమానాన్ని తిరిగి బెంగళూరుకు.. ముంబయి-హైదరాబాద్ ఫ్లైట్ ను ముంబయికే రిటర్న్ పంపించారు.