గురుకులాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని, పనివేళల్లో(Timings) శాస్త్రీయత లోపించడమే ఇందుకు కారణమని వక్తలు అభిప్రాయపడ్డారు. పనివేళలు మానసిక వికాసానికి తగిన విధంగా ఉండాలని ఇండియన్ సైకియాట్రిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.విశాల్ ఆకుల అన్నారు. పౌష్ఠికాహార లోపం, వ్యాయామాలు లేక మానసిక రుగ్మతలకు దారితీసి ఆత్మహత్యలకు కారణమవుతున్నాయన్నారు.
గురుకులాల పనివేళలు-విద్యార్థులపై ప్రభావం అనే అంశంపై టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మానసిక నిపుణులు, బాలల హక్కుల కార్యకర్తలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరయ్యారు. పొద్దున 8 గంటలకు డ్యూటీలకు వచ్చే కొందరు టీచర్లు రాత్రి 9 గంటల వరకు ఉండాల్సి వస్తుందని ఆవేదన చెందారు.
పొద్దున 8 గంటల నుంచి 2:30 వరకు అందరూ.. పగలు 2:30 నుంచి 4:30 వరకు 2/3 వంతు.. రాత్రి 7 నుంచి 9 వరకు 1/3 వంతు ఉపాధ్యాయులు డ్యూటీల్లో ఉండాలి. కానీ ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నదని, నైట్ డ్యూటీ ఉన్నవారు మరుసటి రోజు మధ్యాహ్నం 2:30 వరకు విధుల్లో ఉండాల్సి వస్తుందంటూ వెంటనే పనివేళలు మార్చాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు.