రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించిన మరుసటిరోజే టీచర్ల పోస్టులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 5,089 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఇందులో 2,575 SGT ఉండగా… 1,739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులకు సైతం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్ ను కొద్దిరోజుల క్రితం ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు పంపించారు. అక్కణ్నుంచి ఆమోదం వచ్చేలోపునే… రెండ్రోజుల్లో డీఎస్సీ ఉంటుందని నిన్న(గురువారం) మంత్రి ప్రకటించారు. 5,089 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ను కలెక్టర్లు ఇస్తారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అంటే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ పై అందిన ఇన్ఫర్మేషన్ మేరకే మంత్రి ప్రకటన చేసినట్లు దీన్ని బట్టి అర్థమవుతున్నది.
మరోవైపు పోస్టుల సంఖ్య పెంచాలంటూ బీఎడ్, డీఎడ్ క్యాండిడేట్స్ ఆందోళన బాట పట్టారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగానే 13,500 పోస్టుల్ని రిక్రూట్ చేయాలంటూ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ ను ముట్టడించారు.