ఎన్నికలు అంటేనే పెద్ద తంతు.. అది సక్రమంగా పూర్తి చేయాలంటే భారీగా నిధులు(Funds) అవసరం.. ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు రాజీ లేకుండా భారీగా నిధుల్ని ఖర్చు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ఆదేశాలిస్తుంటుంది. ఈ నిధుల్ని ఆయా నియోజకవర్గాల్లోని RO, AROలు మండల స్థాయిల్లోని అధికారులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
తిండిలేక తిప్పలు…
ప్రతి ఎన్నికకు ప్రాంతాల(Areas) వారీగా భారీగా నిధులు అందుతున్నా చాలా చోట్ల ఖర్చు చేయనే చేయరు. కొంతమంది ఆఫీసర్లు కక్కుర్తితో డబ్బులు పక్కదారి పట్టిస్తుంటారు. పోలింగ్ సెంటర్లలో సకల సౌకర్యాలు చేస్తున్నామంటూ డబ్బును జేబుల్లోకి మళ్లిస్తుంటారు. పోలింగ్ కు ముందురోజు చేరుకునే POలు, APOలు, ఇతర సిబ్బంది నిద్రించడానికి కూడా ఏర్పాట్లుండవు. కనీసం తిండి కూడా సరిగా అందని దుస్థితి. దీనిపై దృష్టిపెట్టాల్సిన EC పెద్దగా పట్టించుకోకపోవడంతో నిధుల్ని మిగిలించుకునే లక్షణం నుంచి బయటపడలేకపోతున్నారు కొందరు అధికారులు.
దానిపైనే…
గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ(రూ.701 కోట్లు), మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికలకు(రూ.622 కోట్లు) మొత్తంగా ఈ రెండు ఎలక్షన్లకు రూ.1323 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో నిధులు దుర్వినియోగమైనట్లు అనుమానంగా ఉందని, దీనిపై అకౌంటెంట్ జనరల్(AG) ద్వారా ఆడిట్ చేయించాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి మంగళవారం CECకి లెటర్ రాశారు. అసెంబ్లీ ఎన్నికల ఖర్చుల వివరాలివ్వాలంటూ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరితే ఆయన జిల్లా కలెక్టర్లకు లెటర్లు రాశారు.