
అనుకున్నది సాధించేవరకు విశ్రమించని విధంగా కనిపించే గవర్నర్ తమిళిసై(Tamilisai).. రాష్ట్రానికి వచ్చి నాలుగేళ్లు పూర్తయింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల బాధ్యతలు చూస్తున్న ఆమె.. అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందర రాజన్ నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. మొదటి మహిళా గవర్నర్(Governor) గా, రాష్ట్ర రాజ్ భవన్ కు రెండో అధినేతగా బాధ్యతలు చేపట్టిన అచీవ్ మెంట్ సాధించారు. తన నాలుగేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా తమిళిసై ఈ రోజు.. కాఫీ టేబుల్ బుక్ విడుదల చేయబోతున్నారు.
తమిళిసై అనుసరిస్తున్న పద్ధతులతో రాజ్ భవన్ కు, ప్రభుత్వానికి దూరం బాగా పెరిగింది. ఒకానొక దశలో విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లింది. సర్కారు పంపిన బిల్లుల్ని క్లారిఫికేషన్ పేరిట పెండింగ్ లో పెట్టడంతో వివాదం రాజుకుంది. ఆమె ఏ మాత్రం తగ్గకపోవడంతో CS, DGP సహా యంత్రాంగమంతా రాజ్ భవన్ కు దూరంగా ఉంది. తమిళిసై పర్యటించే ప్రోగ్రాంలకు సైతం జిల్లాల్లో అధికారుల నుంచి రెస్పాన్స్ రాలేదు. ఇక RTC ఉద్యోగుల విలీన బిల్లునూ ఆమె పెండింగ్ లో పెట్టడం, ఇది క్రమంగా ముక్కోణపు వివాదంగా మారడంతో ప్రభుత్వానికి ఏం చేయాలో తోచలేదు.
చివరకు గవర్నర్ అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ సర్కారు బిల్లుని రెండోసారి పంపడం.. ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా దాన్ని ఆమోదించడం జరిగిపోయాయి. మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్ భవన్ వెళ్లిన CM… సెక్రటేరియట్ లో ప్రార్థనామందిరాల ప్రారంభోత్సవానికి ఆమెకు వెల్ కమ్ చెప్పారు. దగ్గరుండి సచివాలయం మొత్తం చూపించడంతో ఇక ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య దూరం తగ్గిందన్న ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల నడుమ తమిళిసై తన పదవీకాలాన్ని నాలుగేళ్లుగా కొనసాగిస్తూనే ఉన్నారు.