Published 08 Jan 2024
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన ‘మహాలక్ష్మీ’లో భాగంగా అమలు చేస్తున్న మహిళలకు ఉచిత ప్రయాణంపై RTC మరో క్లారిటీ ఇచ్చింది. ఈ పథకాన్ని వినియోగించుకోవాలంటే కచ్చితంగా ఒరిజినల్ గుర్తింపు కార్డు(Identity Card) ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ ‘X(ట్విటర్)’ ద్వారా తెలియజేశారు. ఐడెంటిటీ కార్డులో ప్రయాణికురాలి ఫొటోతోపాటు చిరునామా(Address) తప్పనిసరిగా ఉండాలని తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఏ కార్డయినా ఇందుకు పనికివస్తుంది.. ఒరిజినల్ కార్డులు చూపించాలని చెబుతున్నా ఇప్పటికీ చాలా మంది స్మార్ట్ ఫోన్లలోని ఫొటోలు, జిరాక్స్ లు చూపిస్తున్నారని గుర్తు చేశారు.
పాన్ కార్డు ఉంటే కష్టం…
బస్సుల్లో ప్రయాణించే మహిళల్లో కొందరు పాన్ కార్డులు కూడా తీసుకువస్తున్నారని సజ్జనార్ గుర్తు చేశారు. పాన్ కార్డుల్లో అడ్రస్ లేనందువల్ల అవి చెల్లబోవంటూ పూర్తి స్పష్టతనిచ్చారు. సంస్థ సూచించిన విధంగా గుర్తింపు కార్డులు తీసుకురాకపోవడం వల్ల తరచూ సమస్యలు ఏర్పడుతున్నాయని, ఇలాంటి వారి వల్ల మిగతా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఒరిజినల్ కార్డు లేకుంటే తప్పనిసరిగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఉచిత టికెట్ పైనా వాదనలు…
ఎలాగూ ఫ్రీయే కదా జీరో టికెట్ ఎందుకు అంటూ కొందరు కండక్టర్లతో వాదనకు దిగుతున్నారని, ఆ జీరో టికెట్ల ఆధారంగానే RTCకి ప్రభుత్వం రీయెంబర్స్ మెంట్ చేస్తుందని సజ్జనార్ వివరించారు. ఒకవేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తున్న సమయంలో చెకింగ్ సిబ్బంది వచ్చి చూస్తే సదరు కండక్టర్ ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని, దీంతోపాటు ప్రయాణికులకు సైతం రూ.500 జరిమానా విధించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని పాన్ కార్డును మినహాయించి మిగతా కార్డులు తీసుకురావడంతోపాటు అన్నీ ఒరిజినల్ వి ఉండేటట్లు చూసుకోవాలని ట్వీట్ ద్వారా సజ్జనార్ తెలియజేశారు.