
ఆర్టీసీ ప్రారంభించిన ‘అరుణాచలం’ టూర్.. సంస్థకు కాసుల పంటగా మారింది. జులై 3 గురుపౌర్ణమి సందర్భంగా అరుణాలేశ్వరుడిని దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేసుకునే భక్తుల కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు మొత్తం 15 సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తే… అందులో 13 బస్సుల సీట్లు ఫుల్ అయ్యాయి. మిగిలిన రెండు బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ నడుస్తోంది. రిజర్వేషన్ అవకాశం కల్పించిన కొద్ది సమయంలోనే బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి 12, వేములవాడ నుంచి 2, మహబూబ్ నగర్ నుంచి 1 సూపర్ లగ్జరీ బస్సుల్ని ‘అరుణాచలం’ టూర్ కు నడుపుతున్నారు.

అరుణాచలేశ్వరుడి యాత్రకు ఈ నెల 25 నుంచే బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. జులై 2న ఉదయం 6 గంటలకు MGBS నుంచి బయల్దేరి, కాణిపాకం విఘ్నేశ్వరుడి దర్శనానంతరం అదే రోజు రాత్రి 10 గంటలకు ‘అరుణాచలం’ చేరుకుంటుంది. అక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకున్నాక మధ్యాహ్నం 3 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ కు వెళ్తుంది. గోల్డెన్ టెంపుల్ సందర్శన తర్వాత బయల్దేరి మరుసటి రోజు జులై 4న ఉదయం పదింటికి బస్సు హైదరాబాద్ వస్తుందని RTC అధికారులు తెలిపారు.
ఈ టూర్ టికెట్ ఛార్జి ఒక్కొక్కరికి రూ.2600గా ఉంది. సంస్థ వెబ్ సైట్ www.tsrtconline.inతోపాటు MGBS, JBS, దిల్ సుఖ్ నగర్ సహా RTC రిజర్వేషన్ కౌంటర్లలో ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం 9959226257,9959224911 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. భక్తుల డిమాండ్, రిజర్వేషన్లను బట్టి ఈ టూర్ కు మరిన్ని బస్సులు పెంచుతామని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు.