
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(SRSP) నిండు కుండలా మారింది. జలాశయంలోకి 30 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. నాలుగు గేట్ల ద్వారా 12 వేల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాల్వ ద్వారా 3,000.. ఎస్కేప్ గేట్ల ద్వారా 5,000 క్యూసెక్కుల్ని వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ 1,091 అడుగులకు గాను ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. అటు వాటర్ స్టోరేజీ కెపాసిటీ సైతం 90 TMCలు దాటి.. అంతే స్థాయి కెపాసిటీ ఉన్న జలాశయం ప్రస్తుతానికి ఫుల్ లెవెల్ కు చేరుకుంది. జులైలో కురిసిన వర్షాలకు గోదావరి బేసిన్ లో భారీస్థాయిలో వరద వచ్చి చేరింది.
ఇటు ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలతో SRSP క్రమంగా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో.. వచ్చిన నీటిని వచ్చినట్లుగా వదిలిపెట్టారు. ప్రస్తుత సీజన్ లోనూ పై నుంచి ఆశాజనక పరిస్థితి(Positive Situation) ఉండటంతో ప్రాజెక్టు కింద సాగు చేసే ఆయకట్టుదారుల్లో ఆనందం కనిపిస్తోంది. అటు కృష్ణా బేసిన్ లో పెద్దగా వరద రాకపోవడంతో నీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కానీ అందుకు భిన్నంగా గోదావరి పరివాహకంలో తరలివస్తున్న జలాలతో రైతుల్లో ఆనందం కనిపిస్తున్నది.